11 July, 2026 | 3:05 AM

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం

11-07-2026 02:01 AM

మందుబాబుల జల్సాలకు నిలయంగా ప్రభుత్వ భవనం

పల్లె ప్రకృతి వనంలోని టేకు చెట్లను నరికివేస్తున్న దుండగులు 

మలమూత్రాదులకు నిలయంగా మార్చిన వైనం

కడ్పల్లో కొరవడిన అధికారుల నిఘా

సిర్గాపూర్, జూలై 10: ప్రజలకు ఆహ్లాదం కలిగించాల్సిన పల్లె ప్రకృతి వనాలు.. రైతులకు వ్యవసాయంలో మెలకువలను తెలియజేస్తే రైతు వేదిక ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనాలు ప్రస్తుతం పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి.

రైతుల సంక్షేమం, గ్రామీణ ఆహ్లాదం కోసం నిర్మించిన ఈ ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కావడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొందరు మద్యం సేవిస్తూ ఈ ప్రాంగణాలను మందుబాబుల అడ్డాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, చెత్తను అక్కడే వదిలి వెళ్లడంతో ప్రాంగణాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

ఉదయం వాకింగ్కు వచ్చే వారు పల్లె ప్రకృతి వనంలో మల విసర్జనకు ఉపయోగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటున్నారు. అంతే కాక పల్లె ప్రకృతి వనంలోని టేకు వనరులు (చెట్లను) నరికి వేస్తూ అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మందు బాబులు రైతువేదికలోని మరుగుదొడ్లు, కిటికీల అద్దలను సైతం ధ్వంసం చేశారు. రైతులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం వడపోత (జల్లెడ మిషన్) ద్వాంసం చేసి దానిలోని మోటార్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. రాత్రి వేళల్లో మద్యం సేవించి బాటిల్లను పగులగొట్టడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. 

అధికారుల పర్యవేక్షణ కరువు...

రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం ఊరి చివరలో ఉండడం చేతనే దుండగులు, మందు బాబులు అసంగిక అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతుల సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం నిర్మించిన రైతు వేదికలు తమ అసలు లక్ష్యానికి అనుగుణంగా వినియోగించబడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, తగిన విద్యుత్ వెలుతురు కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలను ప్రజలకు ఉపయోగపడే విధంగా సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సమాచారం ఇస్తే ఫ్రైజ్ మనీ ఇస్తాం..

గ్రామంలో పల్లె పకృతి వనంలో ఇటీవల కొంత మంది ఆకతాయిలు అసాం ఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది పెంచిన చెట్లను నరికేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఇలాంటి పనులు చేసిన వారిపైన  చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మద్యం సేవించే సమాచారం తెలిపితే వారికి గ్రామ పంచాయితీ నుండి రూ.2000  ప్రైజ్ మనీ కూడా ఇస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతాం.

రవీందర్ రెడ్డి,

పంచాయితీ కార్యదర్శి