పోలియో రహిత తెలంగాణే లక్ష్యం
మంత్రి దామోదర రాజనర్సింహ
జూబ్లీహిల్స్, జూన్ 28(విజయక్రాంతి): పోలియో రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. సోమవారం పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ ఏడాది 52 లక్షల మంది చిన్నారులకు వాక్సిన్‌ను వేస్తున్నామని వెల్లడించారు.
పోలియో నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ ప్రియాంక అలా, ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






