ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం
యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో టీటీఏ అధ్యక్షుడు ఎస్ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జీవో 25ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంది.
టెట్‌లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, సబ్జెక్టు వారీ పేపర్లతో స్పెషల్ టెట్ నిర్వహించాలని, మోడల్ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలని, పిఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సమావేశంలో యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్(టీఎస్ యూటీఎఫ్), సీహెచ్ అనిల్ కుమార్, ఎన్ తిరుపతి( టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డీటీఎఫ్), కొమ్ము రమేష్ (బీటీఎఫ్), యానం విజయకుమార్, ఇటికాల రవీందర్(ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), బి కొండయ్య (ఎంఎస్ టీఎఫ్), లక్ష్మణ్(టీటీఏ), రవీందర్, లక్ష్మయ్య యాదవ్(టీపీటీఎఫ్) పాల్గొన్నారు.






