8 April, 2026 | 3:50 AM

బాధితులకు ఎక్సైజ్ శాఖే పరిహారం ఇవ్వాలి

08-04-2026 02:00 AM

కల్తీ కల్లు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి

ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ సీఎంకు లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): గతేడాది జులైలో కూకట్‌పల్లి, బాలనగర్ ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించడం వల్ల 14 మంది మరణించారని, దాదాపు 100 మంది ఆసుపత్రిలో చేరారని, ఈ ఘటనకు సంబంధించి 13 కేసులు నమోదు చేశారని అయితే ఆ కేసులు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయని, ఇప్పటి వరకు చార్జిషీట్లు దాఖలు చేయలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం. పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కేవలం రికార్డు కోసం కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ, చార్జిషీట్లు దాఖలు చేయకపోవడంతో వారు తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారన్నారు. అయితే మరణించిన 14 మంది, ఆసుపత్రిలో చేరిన దాదాపు 100 మంది లైసెన్సు పొందిన కల్లు విక్రేతల వద్ద నుంచి కల్లు సేవించారు. అందువల్ల ప్రాణ నష్టం, ఆసుపత్రి ఖర్చులకు ఎక్సైజ్ శాఖ బాధ్యత వహించి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి.

ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని శారీరక పని చేయలేని స్థితికి చేరిన వారికి పరిహారం ఇవ్వాలి. నిందితులపై త్వరితంగా కేసులు నడిపి శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలి.50 కిలో మీటర్ల పరిధిలో కల్లు తీయగల చెట్లు లేని ప్రాంతాల్లో కల్లు దుకాణాలు ఉండకుండా ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలి. కల్లు దుకాణాలను నిరంతరం తనిఖీ చేసి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలి. డ్రగ్స్ కేసుల విషయంలో చేస్తున్నట్లే కల్తీ కల్లు సేవించడం వల్ల కలిగే ప్రమాదాలపై పెద్ద స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.