8 April, 2026 | 3:51 AM

వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం

08-04-2026 01:57 AM

ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశం

ఇల్లందు పట్టణంలో పర్యటించిన కలెక్టర్

ఇల్లెందు, ఏప్రిల్ 7(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, వివిధ వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి లోపాలు గమనించిన చోట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులను ఆదేశించారు.

మొదటగా ఇల్లందు వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స్ నిలిపి ఉంచడం గమనించి దాని అవసరం, అనుమతులపై అధికారులను ప్రశ్నించారు. ఆసు పత్రి ఆవరణలో ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తగిన వివరణ ఇవ్వాలని ఆర్‌ఎంఓను ఆదేశించారు.

అనంతరం ఇల్లందు ట్రైబల్ వెల్ఫే ర్ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, వంటశాలలో సిద్ధం చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలు, భోజన నాణ్యత, బోధనపై వివరాలు తెలుసుకున్నారు. ఇల్లందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్‌కు విద్యార్థులు వార్డెన్ సిబ్బంది ఎవరు లేకపోవడం గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వసతి గృహ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో సంబంధిత వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, నిర్ణీత సమయానికి భోజనం సిద్ధం కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఆర్‌ఎంఓ రామ్ నివాస్, డ్యూటీ డాక్టర్ ప్రత్యూష, వస్తి గృహాలు వార్డెన్లు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.