రైతులకు మంచి చేయడం మరిచిన కాంగ్రెస్
వరి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హన్వాడ, మే 14 : రైతులతో పాటు ప్రజలకు మంచి చేయడమే కాంగ్రెస్ మర్చిపోయిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు.
రైతులకు సరిపడా వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు.తేమ శాతం (మాయిశ్చర్) పేరుతో రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. తరుగు పేరుతో ధాన్యాన్ని అధిక మొత్తంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతులకు చెల్లింపులు సమయానికి జరగడం లేదన్నారు. చెల్లింపుల ఆలస్యంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కొంతమంది రైతులు పంటను కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. వర్షాలు పడితే ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. రైతులకు న్యాయమైన ధర కల్పించి, సమయానికి చెల్లింపులు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.






