అభివృద్ధి బాటలో కర్రెగుట్టలు
వేగంగా రహదారి పనులు
ములుగు (మహబూబాబాద్) మే 14 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ పర్యవేక్షణలో శరవేగంగా కర్రెగుటల్లో రోడ్డు పనులు పూర్తి చేసే దిశగా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు పనులు తడపాల కొండల వరకు చేరుకున్నాయి. గురువారం ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు ప్రాంతాన్ని సి ఆర్ పి ఎఫ్ దక్షిణ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిదీప్ సింగ్ సాహి, ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తో కలిసి రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు.
కర్రెగుట్టల వంటి కఠినమైన భూభాగంలో వేగంగా జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తడపాల కొండల వరకు రహదారి పనులు దాదాపు పూర్తికావడం పట్ల అభినందనలు తెలిపారు. మోరుమూరు నుండి పామునూరు, పామునూరు నుండి జెల్లా, జెల్లా నుండి డోలి, డోలి నుండి తడపాల కొండల వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తికావడం విశేషమని పేర్కొన్నారు.
అత్యంత క్లిష్టమైన అటవీ ప్రాంతంలో సైతం వేగవంతంగా రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు. ఈ రహదారుల నిర్మాణం ద్వారా స్థానిక గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా, వైద్య, విద్య,అత్యవసర సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం అధికారులు పామునూరు సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించి భద్రతా పరమైన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భద్రతా బలగాల సమన్వయం, సరిహద్దు ప్రాంత భద్రత, మావోయిస్టు వ్యతిరేక చర్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింజ్ , 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్ , 39 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండ్ పంచం లాల్, జాంగ్షేర్, వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, వెంకటాపురం ఎస్త్స్ర తిరుపతి రావు పాల్గొన్నారు.






