కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు బీహార్ జైలు నుంచి స్కెచ్
ఈ దొంగలు మామూలోళ్లు కాదు!
ఆ ముఠా సభ్యుల తీరే వేరు. వారికి పేర్లుంటాయి.. అవి నకిలీవి. వారికి ఆధార్ కార్డులు ఉంటాయి.. అవి ఫేక్!. ముఠాలో ఒకరి ఐడెంటిటీ మరొకడికి తెలియదు. ఒకడిని పట్టుకున్నా, మిగతా వారిగురించి చెప్పలేడు. వారికి నెలనెలా జీతం వస్తుంది. అనుకున్న దోపిడీ పూర్తిచేస్తే ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. బీహార్‌లోని పూర్ణియా జైల్‌లో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సుబోధ్ సింగ్ ఈ ముఠాకు నాయకుడు. వ్యూహం ప్రకారం రెండునెలల ముందే ఈ ముఠా తెలంగాణలో రెక్కీ నిర్వహించింది. అంతేకాదు తమ వాహనాలను రెండు నెలల ముందే అనుకున్న ప్రదేశాల్లో పార్క్ చేసిపెట్టింది.
అది అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా.. -ముగ్గురి అరెస్ట్
కరీంనగర్, మే 14 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసిన ట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ దోపిడీ కేసు ను తమ సిబ్బంది ఒక సవాల్ గా తీసుకుని, అత్యంత చాకచక్యం గా ఛేదించారని ఆయన ప్రశంసించారు.
ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్ట్టర్, ‘ది గోల్డెన్ థీఫ్’గా ఇప్పటికే పేరుతెచ్చుకున్న సుబోధ్ సింగ్ హస్తం ఉందని దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. జైలు నుంచే అతను ఈ పథకాన్ని రూపొందించాడని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్‌తో పాటు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి రూ.51 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డు లు, మరియు నిందితులు వాడిన నకిలీ ఆధార్ కార్డులను స్వాధీ నం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అత్యంత ప్రమాదకరమైన వారని, దోపిడీకి రెండు నెలల ముందే వీరు తెలంగాణకు చేరుకున్నారని ఆయన తెలిపారు.
ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి పట్టణాల్లో క్షుణ్ణంగా రెక్కీ నిర్వహించారని, పోలీసులకు చిక్కకుండా నకి లీ బైక్ నంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులను వాడారని పేర్కొన్నారు. ధర్మపురిలో గోదావరి నది ఒడ్డున పగలగొట్టి ఉన్న ఒక మొబైల్ ఫో న్, వదిలేసిన ఒక మోటర్ సైకిల్ ఆ ముఠాను పట్టుకునేందుకు పోలీసులకు క్లూ ఇచ్చాయి.
త్వరలోనే సొత్తు రికవరీ..
మే 3న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు, నలుగురు సిబ్బందిని తుపాకులతో బెదిరించి.. ఎదురుతిరిగిన వారి పై కాల్పులు జరిపారు. సుమారు రూ. 82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారం, 112. క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారని సీపీ వివరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడానికి, చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడానికి ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
త్వరలోనే అందరినీ పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని, వ్యాపారులు భయపడాల్సి న అవసరం లేదని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారు. దోపిడీకి ముందు నింది తులు ధర్మపురిలో ఆశ్రయం పొందారు. చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి.. ధర్మపురి వద్ద వాహనాలు వదిలి పరారయ్యారు. రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు వారు ప్రయత్నించారని సీపీ తెలిపారు.
బీహార్, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందని, తెలంగాణలో ఇలాంటి తరహా దోపిడీ జరగడం మొదటిసా రి అని సీపీ వివరించారు. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్ ను 13న సాయంత్రం 4 గంటల సమయంలో వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చారు.
రఘునాథ్ కర్మాకర్ విచారణలో బీహార్, బె ంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దోపి డీ ముఠా గురించి కీలక సమాచారం బయటపడింది. సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయని సీపీ తెలిపారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, లాడ్జ్లు, గెస్ట్ హౌస్ యజమానులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాణ్యమైన సీసీటీవీ కెమె రాలు ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి అప్రమత్తంగా ఉంచాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్‌లు సరైన ఐడీ ధృవీ కరణ తర్వాత మాత్రమే కస్టమర్లకు గదులు ఇవ్వాలన్నారు. నగదు, బంగారం రవాణా సమయంలో భద్రతా నియమాలు పాటించాలని, ఎమర్జెన్సీ అలారం వ్యవస్థలు, పానిక్ బట న్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. శాస్త్రీయ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణ, అంతర్రాష్ట్ర సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.






