15 May, 2026 | 3:01 AM

మొబైల్ టూరిజం మ్యూజియం ప్రారంభం

15-05-2026 01:28 AM

హనుమకొండ, మే 14 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యాటక మొబైల్ మ్యూజియాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయ్ గురువారం ప్రారంభించారు.హనుమకొండ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ మ్యూజియం మూడు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, ప్రత్యేక ప్రదర్శనలు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.పర్యాటక ప్రాంతాల విశేషాలు, సందర్శనకు సంబంధించిన సమాచారం, పర్యాటకులకు అవసరమైన బ్రోచర్లు, సమాచార పుస్తకాలను కూడా మ్యూజియంలో అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మొబైల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి ఎ. శ్రీనివాస్ కుమార్, ఎన్‌ఐసీ అధికారి శ్రీధర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. అయూబ్ అలీ, టీజీవో అధ్యక్షుడు జగన్ మోహన్, రాజేష్, ప్రవీణ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, సందర్శకులు తదితరులు పాల్గొన్నారు.