పంతుళ్ల ద్విపాత్రాభినయం!
ఇటు బడి బాట
అటు జన గణన
మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): మండువేసవిలో..అటు బడి బాట..ఇటు జన గణన కోసం ప్రభుత్వ పాఠశాలల పంతుళ్లు ద్విపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితికి ఏర్పడిందని వాపోతున్నారు. తమ వృత్తి ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలా.. ప్రభుత్వం ఆదేశించిన జన గణనకు ప్రాముఖ్యత ఇవ్వాలా అనే సందిగ్ధంలో ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంతోపాటు పేద విద్యార్థులకు విద్యా బోధన అందించేందుకు, ప్రభుత్వ విద్య వ్యవస్థ పరిపుష్టి చేయడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు రాము విధులు నిర్వహించే పాఠశాలల అభ్యున్నతి, విద్యార్థుల చేరిక కోసం కచ్చితంగా ఆ కార్యక్రమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఇదే సమయంలో జన గణన కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత కూడా ఉపాధ్యాయుల తలకెత్తడంతో అటు బడిబాట.. ఇటు జన గణన ఒకే సమయంలో నిర్వహించడం ఎలా అంటూ ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. జనగణన కోసం ఉదయం పూట ప్రస్తుతం గృహ గణన నిర్వహిస్తుండగా, ఇప్పటికే అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ఇక బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలని హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు ఆదేశాలు ఇస్తుండడంతో.. రెండు పనులు ఒకేసారి ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు మండుతున్న ఎండలు ఉపాధ్యాయులకు మరో సమస్యగా మారుతున్నాయి. బడి బాట కార్యక్రమం కోసం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి ఒప్పించడం, అలాగే పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పక్షం రోజుల పాటు తమకు ఇతర విధులు నిర్వహించకుండా కేవలం బడిబాట కార్యక్రమం అప్పగిస్తే కొంత అనుకూలంగా ఉండేదని, ఇదే సమయంలో జన గణన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించడంతో రెండు రకాల పనులను ఒకే సమయంలో నిర్వహించడం కష్టతరంగా మారిందని, ఏ పని కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి రెండు కార్యక్రమాలతో ఇబ్బంది
బడిబాట కార్యక్రమం ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు మూడు రోజుల ముందు ఉండేది. ఈసారి బడిబాట కార్యక్రమాన్ని ఇలా ముందస్తుగా పెట్టి, అటు జనగణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పాల్గొనమనడం బడిబాట కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుంది.
ప్రభుత్వంగా మేము ముందస్తుగా బడిబాట కార్యక్రమం పెట్టిన ఉపాధ్యాయులు విద్యార్థులను చేర్పించలేకపోయారని ఉపాధ్యాయుల మీద అపవాదు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనబడుతుంది. ఇప్పటికే జనగణ విధులు పనిచేసే చోట కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో కేటాయించి ఇబ్బందులకు గురి చేస్తుంటే, ఇలా బడిబాట కార్యక్రమంలో పాల్గొనమనడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి.
సిహెచ్. లింగారావు, ఉపాధ్యాయుడు






