కేరళం కొత్త సీఎం సతీశన్
పది రోజుల ఉత్కంఠకు తెర
- ప్రజాభిప్రాయానికి జైకొట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం
- ఇది సమష్టి విజయం : వీడీ సతీశన్
- అధిష్ఠాన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, మే 14: ప్రజాభిప్రాయానికే కాంగ్రెస్ అధిష్ఠానం తలొగ్గుతూ.. కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో కేర ళం సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నా.. కేరళంలోని పార్టీ కేడర్‌లో అత్యధికులు ఆయన వైపు మొగ్గుచూపినా.. ప్రజాభిప్రాయం మా త్రం సతీశన్ వైపు ఉండడంతో వీడీ సతీశన్ పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
దీంతో కేరళంలో 10 రోజలు ఉత్కంఠకు తెరపడి, చివరకు సీఎం పదవి వడస్సేరి దామోదరన్ సతీశన్‌ను వరించింది. తన పేరును సీఎంగా ఖరారు చేసిన అనంతరం వీడీ సతీశన్ మీడియా తో మాట్లాడుతూ.. కేరళంలో కాంగ్రెస్ కూటమి ఘన విజ యం వెనుక వేణుగోపాల్, చెన్నితాల ఎనలేని కృషి ఉంద ని, ఈ ప్రజాతీర్పు.. వ్యక్తిగతం కాదని, ఇది సమష్టి విజయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, వీడీ సతీశన్‌కు నా అభినందనలు అని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో అన్నారు.
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేరళం ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు 102 స్థానాలు కట్టబెట్టారు. దీంతో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు తెరపడింది. అయి తే సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర పోటీ నెలకొంది. దాంతో పార్టీ అధిష్ఠానం కేరళంలోని కాంగ్రెస్ నేతలతో వరుసగా సంప్రదింపులు జరిపి చివరకు వీడీ సతీశన్ పేరును ఖరారు చేసింది.
ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో వీడీ సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళంలోని కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గు చూపింది.
ఈ విజయంలో వేణుగోపాల్, చెన్నితాల కీలకపాత్ర
- కాబోయే కేరళం సీఎం వీడీ సతీశన్
కేరళం ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత వీడీ సతీసన్ వేణుగోపాల్, చెన్నితాలను ప్రశంసించారు. కేరళంలో కాంగ్రెస్ నే తృత్వంలోని కూటమి ఘన విజయం వెనుక తన సహ అభ్యర్థులైన కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ప్రజాతీర్పు వ్యక్తిగత విజయం కాదని, సమిష్టి విజయమని ఆయన వెల్లడించారు. సీఎం పదవి కోసం పార్టీలో రోజుల తరబడి తీవ్రమైన లాబీయింగ్, వర్గపోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో, కేరళలో ఏఐసీసీ కార్యకలాపాలను రోజువారీగా సమన్వయం చేస్తున్నందుకు వేణుగోపాల్‌ను సతీసన్ ప్రశంసించారు.
అలాగే, ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా చెన్నితాల పాత్రను అంగీకరిస్తూ, పార్టీ ఘనంగా తిరిగి అధికారంలోకి రావడంలో ఈ ఇద్దరు నాయకులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ‘నేను దీనిని వ్యక్తిగత విజయంగా భావించడం లేదు. ఈ విజ యానికి చాలా మంది దోహదపడ్డారు. ఏఐసీసీ అతిపెద్ద పాత్ర పోషించింది. కేసీ వేణు గోపాల్ అన్ని ప్రయత్నాలను సమన్వయం చేశారు.
ఆయన ప్రతిరోజూ మాతో నిరంతరం సంప్రదిస్తూ, దిశానిర్దేశాలు, మార్గని ర్దేశం అందించారు’ అని కాబోయే ముఖ్యమంత్రి సతీశన్ అన్నారు. రమేష్ చెన్నితాల కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని, ఆయన నా నాయకుడని, ప్రియమై న సహచరుడని తెలిపారు. ఇకపై నేను అందరినీ కలుపుకొని వారి నమ్మకం, మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుని కేరళం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
- ఏఐసీసీ కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ యాన్ని ఏఐసీసీ ప్ర ధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘హృదయపూర్వకంగా స్వాగతించారు. తదుపరి ముఖ్యమంత్రిగా సతీశన్‌కు తన మద్ద తును ప్రకటించారు. కేరళం సీఎంగా సతీశన్ పేరును అధిష్ఠానం ప్రకించిన తర్వాత ఢిల్లీ లో మీడియాతో వేణుగోపాల్ మాట్లాడారు. ‘తుది నిర్ణయం వెలువడింది. కేరళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది.
ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తు న్నాను. ఈ పదవి లభించినందుకు వీడీ సతీశన్‌కు నా అభినందనలు’ అని తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇకపై ఎటువంటి సమస్యలూ తలె త్తవని, తనకు పార్టీ, పార్టీ కార్యకర్తలే అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కేరళం సీఎం పదవికి తనను పరిగణించనప్పటికీ, పార్టీయే సర్వోన్నతమని ఆయన అన్నారు.
తనకు పార్టీ, దాని కార్యకర్తలే సర్వోన్నతులని, పార్టీ కార్యకర్తలు బాధపడితే.. తాను కూడా బాధపడతానని ఆయన తెలిపారు. సీఎం పదవికి ప్రధాన పోటీదారులలో ఒకరిగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా అంగీకరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దానిలో ఎలాంటి సందేహమూ లేదని వేణుగోపాల్ చెప్పారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..
వీడీ సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. కొచ్చికి సమీపంలోని ఎర్నాకులం జిల్లాలోని నెట్టూర్‌లో 1964, మే 31వ తేదీన ఆయన జన్మించారు. వృ త్తిరీత్యా కేరళం హైకోర్టులో న్యా యవాది. సతీసన్ రాజకీయ ప్రస్థానం క్యాంపస్‌లో ప్రారంభమైంది. అక్కడ ఆయన 1986- 87లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ యూనియన్ ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత కేరళం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (కేఎన్‌ఎస్‌యూఐ)కి కార్యదర్శి అయ్యారు.
దీంతో చిన్న వయ సులోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఒక సమర్థుడైన నిర్వాహకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వా త కేరళం అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్‌గా పనిచేశారు. సామాజిక కార్యకర్తగానూ పేరు సంపాదించుకున్నారు. మంచి వక్తగానూ పేరొందారు. తర్వాత ప్రజానేతగా, ఎలాంటి గ్రూపు రాజకీయాలకు చోటివ్వకుండా సంస్కరణాభిలాషిగా, శ్రేయోభిలా షిగా ఎదిగారు.
పరాపూర్ నుంచి వరుసగా ఆరుసార్లు (2001, 2006, 2011, 2016, 2021, 2026) ఎమ్మెల్యేగా సతీశన్ ఎన్నికయ్యారు. 2021లో ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. ఆ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ విజ యం సాధించగా, యూడీఎఫ్ ప్రతిపక్షానికే పరిమితమైంది. కానీ ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితుల య్యారు. ఎల్‌డీఎఫ్‌ను ఎదుర్కొనే నేతగా ఎదిగారు. అవి నీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపి, పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు.
దేశంలో హస్తం చతికిల పడుతున్నా రాష్ట్రంలో మా త్రం కాంగ్రెస్‌ను కొత్తపుంతులు తొక్చించారు. ఎన్నికల్లో విజయన్‌కు ప్రధాన పోటీదారుగా తనను తాను నిరూపించుకున్నారు. అందకే సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం వెల్లడైంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపగా, ప్రజల్లో మాత్రం సతీశన్ పేరు మారుమోగింది. దీంతో ప్రజాభిప్రాయానికి అధిష్ఠానం జైకొడుతూ.. చివరికు సతీశన్‌ను సీఎం పదవికి ఎంపిక చేసింది.






