కళతప్పిన క్లాక్‌టవర్
వారసత్వ కట్టడాలు, ప్రదేశాలకు నెలవైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో.. క్లాక్‌టవర్ ఒకటి. స్థానిక ప్రజలు సమయం తెలుసుకోవడానికి నిజాం కాలంలో నిర్మించిన ఈ క్లాక్ టవర్.. చారిత్రక ఆనవాలకు ప్రతీకగా నిలుస్తోంది. దాదాపు 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గడియారం.. నాటి వైభవాన్ని చాటుతున్నప్పటికీ కాలక్రమేణా మసకబారుతోంది. సరైన సంరక్షణ లేకపోవడంతో టవర్ శిథిలావస్థకు చేరి గడియారం పని చేయడం లేదు. రెండున్నర దశాబ్దాలుగా దీన్ని పట్టించుకునే నాథుడే లేక పక్షులకు నిలయంగా మారింది.
పట్టణంలో టవర్ మాదిరిగా ఎతైన నిర్మాణం చేపట్టి, ఎటు నుంచి చూసినా సమయం కనిపించేలా దానికి నాలుగు వైపులా పెద్దపెద్ద గడియరాలు బిగించారు. ఈ టవర్ ను గడియార్ ఘర్ అని పిలిచేవారు. స్థానికులకు సమయం తెలిసేలా గంటగంటకు మోగేవి. దాదాపుగా కిలోమీటరు దూరం వరకు ఈ శబ్దం వినిపించేది. శబ్దాన్ని బట్టి పట్టణ వాసులు సమయాన్ని తెలుసుకునేవారు. కాగా ఈ గడియారాన్ని నిజాం కాలం లో 1917 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతారు. మధ్యలో ఒకసారి పని చేయకపోతే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మెకానిక్ లను తీసుకువచ్చి రిపేర్ చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత 2000 సంవత్సరం నుంచి ఈ టవర్ శిథిలావస్థకు చేరడంతో గడియారం పూర్తిగా పని చేయడం లేదు.
శిథిలావస్థకు టవర్
గడియారం ఏర్పాటు చేసిన స్థలాన్ని ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి కేటాయించారు. మొదట ఈ గడియారం ఉన్న భవనమే కార్యాలయంగా కొంతకాలం కొనసాగిం ది. ఆ తర్వాత దాని పక్కనే నూతన భవనం నిర్మించారు. ప్రస్తు తం కొత్త భవనం నుండి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. గడియారం ఉన్న భవనం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉండటంతో పక్షులకు నిలయంగా మారింది. మార్కెట్ యార్డు కు వచ్చే రైతులకు ఈ టవర్‌పై నలుదిక్కులా ఉన్న గడియారాలే సమయాన్ని తెలిపేవి.
గడియార్ ఘర్ కాలనీగా గుర్తింపు
క్లాక్‌టవర్ ప్రాంతంలో ఉన్న కాలనీని కాలానుగుణంగా గడియార్ ఘర్ కాలనీగా పిలుచుకుంటున్నారు. మున్సిపాలిటిలో కూడా ఇదే పేరుతో కాలనీ నమోదై ఉంది. మార్కెట్ యార్డుకు అనుకోని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం ఏర్పాటు చేసి, నెహ్రూ చౌక్‌గా నామకరణం చేశారు. అయినప్పటికీ ప్రజలు గడియార్ ఘర్ కాలనీగా పిలవడం చూస్తే ఈ క్లాక్‌టవర్‌కు ఎంత గొప్ప ప్రచారం ఉండేదో అర్థం అవుతోంది.
చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి
ఆదిలాబాద్ పట్టణంలో నిజాంకాలంలో నిర్మించిన క్లాక్‌టవర్ కొన్నేళ్లుగా పని చేయడం లేదు. చారిత్రక కట్టడాలను కాపా డుకోవడం పాలకుల కర్తవ్యం. ఎంతో చరిత్ర కలిగిన ఈ గడియారానికి తక్షణమే మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలి.
ఎస్.రాజవర్ధన్, ఆదిలాబాద్






