calender_icon.png 15 February, 2026 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాండ్‌మేళం సౌండ్ చేయడం పక్కా

15-02-2026 01:22:03 AM

కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్‌మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. మార్చి 13న రిలీజ్ కానుందీ చిత్రం. శనివారం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను దర్శకుడు త్రివిక్రమ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. “బ్యాండ్ మేళం’ గ్లింప్స్ చూసిన వెంటనే రోషన్ నంబర్ కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడాను. రోషన్ పెద్ద స్టార్ అవుతాడు. ఎంతో కూల్‌గా నటించేశాడు.

నా లవ్ స్టోరీ అంటే సుకుమార్‌కు చాలా ఇష్టం. ‘నీ కథ నువ్వు తీస్తావా? నేను తీయాలా?’ అంటుంటారాయన. ‘సార్ నేనే తీస్తా’నని చెబుతుంటా. అయితే, నేను లవ్‌స్టోరీ తీస్తే కచ్చితంగా రోషన్‌తోనే తీస్తా. ఈ సినిమా తర్వాత మగాళ్ల మెడలో తాళిబొట్టు కనిపిస్తుందేమో అని కంగారు పడుతున్నా. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో సౌండ్ చేస్తుంది” అని అన్నారు. చిత్ర నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. “నిన్ను కోరి’ గుర్తుండిపోయే చిత్రం అయింది. మళ్లీ అలాంటి ఫీలింగే సతీశ్ జవ్వాజీ చెప్పినప్పుడు అనిపించింది.

‘తాళి కట్టడం కలిసి ఉండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టిన దానికి కాదురా.. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా’ అనే ఈ ఒక్క డైలాగ్ విన్న తర్వాతే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. నేనేమీ రెగ్యులర్ ప్రొడ్యూసర్‌ను కాదు.. మనసుకు నచ్చిన కథ వస్తేనే సినిమా తీస్తా. ‘బ్యాండ్‌మేళం’ జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అన్నారు. కథానాయకుడు హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. “బ్యాండ్ మేళం’ పేరు అందరూ వినే ఉంటారు. మా సినిమాతో ఆ పేరు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంది” అన్నారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. “బ్యాండ్‌మేళం’ నాకెంతో ప్రత్యేకం. ఇందులో రాజమ్మ పాత్రలో అందరినీ నవ్విస్తా, ఏడిపిస్తా. ‘కోర్ట్’ కంటే ‘బ్యాండ్‌మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. దర్శకుడు సతీశ్ జవ్వాజీ మాట్లాడుతూ.. ‘నేను ప్రతీ సీన్‌ను ఎంతో ఎమోషన్‌తో రాశా. అంతే ఎమోషన్‌తో ప్రతీ సీన్‌ను తెరకెక్కించా. రోషన్, శ్రీదేవి నటనలతో ఆ ఎమోషన్స్ మరింత పండాయి” అని చెప్పారు. బీవీఎస్ రవి, బెక్కెం వేణుగోపాల్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, మిగతా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.