6 May, 2026 | 10:53 AM

రైతులను నట్టేట ముంచిన వర్షం

06-05-2026 10:07 AM

సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం

టార్ఫాలిన్లు ఇవ్వకపోవడంతో తూకం వేసిన ధాన్యం వానపాలు

లబోదిబోమంటున్న రైతులు

తడిసిన ధాన్యం కొనాలి - బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి( Heavy Rains) రైతాంగం విలవిలలాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, సమయానికి ధాన్యం తూకం వేయకపోవడం, వేసినా వాటిని తరలించకపోవడంతో రైతులు గోసపడుతున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎండ, వాన నుంచి తలదాచుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడాలేవని, చిన్న కుటారాలు వేసి చేతులు దులుపుకున్నారు. అవి కూడా కేవలం గన్నీసంచులు నిలువ చేసేందుకు వాడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అయితే మొత్తానికి మొత్తం ఏమీ లేదు. కేవలం చెట్లు, గట్ల కిందనే రైతులు తలదాచుకుంటున్నారు.

టార్ఫాలిన్లు ఇవ్వకపోవడంతో తూకం వేసిన ధాన్యం వానపాలు

ప్రతి కొనుగోలు కేంద్రానికి మార్కెట్ కమిటీ నుంచి టార్ఫాలిన్ కవర్లు అందజేస్తుంటారు. అవి ఎక్కడా రైతులకు ఇస్తున్న దాఖలాలు లేవు. వాటిని నిర్వాహకులే వాడుకుంటున్నారు తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగపడటం లేదు. రైతులే స్వయంగా కొనుగోలు చేసిన లేదా అద్దెకు టార్ఫాలిన్ కవర్లు తెచ్చుకొని ధాన్యాన్నికాపాడుకుంటున్నారు. తెచ్చుకున్న టార్పాలిన్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు పడిన సమయంలో రైతులు నెలల తరబడి కాపాడుకున్న పంట వాన పాలవుతుందని వాపోతున్నారు.

లబోదిబోమంటున్న రైతులు

అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవగా రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు నిర్వాహకుల నిర్లక్ష్యం, సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించడంలో అధికారుల వైఫల్యంతో తూకం వేసిన బస్తాలు సైతం వానకు తడిసాయి. కనీసం తూకం వేసిన బస్తాలకు రక్షణగా నిర్వాహకులు టార్ఫాలిన్ లు ఇవ్వకపోవడం, రైతులు వారు తీసుకొచ్చిన కవర్లు గాలికి లేచిపోవడంతో బస్తాలు వానాపాలయ్యాయి. తూకానికి హమాలీలకు డబ్బులిచ్చామని, మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టి, మరోసారి ధాన్యం తూకం వేయిస్తే రెట్టింపు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. 

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి - నడిపెల్లి విజిత్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మంచిర్యాల

సరైన సమయానికి వాహనాలు సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అధికారులు ఫొటోలకు ఫోజులిస్తున్నారే తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. తూకం వేసిన బస్తాలు తడవడానికి నిర్వాహకులు, అధికారులు బాధ్యత వహించి ధాన్యం తరలించాలి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు తూకం వేసే వరకే రైతు బాధ్యత, తర్వాత వారిదే. తడిసిన ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తాం. లక్షెట్టిపేట మండలంలో పంటలను కాపాడుకోవడానికి వెళ్లి మృతి చెందిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.