కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్
ఉట్నూర్, జులై 17 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ను తెలంగాణ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నాగోబా దేవుని ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మెశ్రం వంశీయులతో ఆత్మీయంగా సమావేశమైన కమిషన్ చైర్మన్ నాగోబా దేవాలయ చరిత్ర, మెశ్రం వంశీయుల సంప్రదాయాలు, నాగోబా జాతర విశిష్టత, గిరిజనుల ఆచార వ్యవహారాల గురించి వివరంగా తెలుసుకున్నారు. మెశ్రం పెద్దలు నాగోబా దేవత ఆవిర్భావం, జాతర నిర్వహణ విధానం, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు, గిరిజనుల సామాజిక, సాంస్కృతిక జీవన విధానంపై సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, నాగోబా దేవాలయం తెలంగాణ గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. నాగోబా జాతర దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి ప్రతిబింబమని, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గొప్ప వారసత్వమని పేర్కొన్నారు. గిరిజన సమాజం తమ మూలాలను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని, నాగోబా ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలు గిరిజనుల ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలను, వారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
అనంతరం కమిషన్ సభ్యులు ఆలయ పరిసరాలను పరిశీలించి, దేవాలయ విశిష్టత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాగోబా దేవాలయం, జాతర నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై స్థానిక పెద్దలతో అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యులు, మెశ్రం వంశీయుల పెద్దలు, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






