2 May, 2026 | 3:27 AM

తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్

02-05-2026 02:24 AM
  1. శాంతి భద్రతల రక్షణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  2. డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ బాస్‌గా బాధ్యతల స్వీకరణ
  3. 2028 జూన్ వరకు ఆయనే డీజీపీ

సికింద్రాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ అని నూతన డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడటంలో అధి కారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తనపై నమ్మకంతో డీజీపీగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి సీవీ ఆనంద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డీజీపీ కార్యాలయం లో శుక్రవారం రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.

ఆయన 2028 జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోలీసు విభాగం నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్ద పీట వేస్తానని, ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలూ శ్రమిస్తానని చెప్పా కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పని చేస్తామన్నారు.

‘నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పని తీరు కనబరిచారు. మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారింది. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం బాగా కృషి చేస్తోంది. శాంతిభద్రతల సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలను అదుపు చేయడంలో జిల్లా ఎస్పీల పాత్ర కీలకంగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నట్లు సీవీ ఆనంద్ ప్రకటించారు. మహిళల సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలు వ్యవస్థీకృత నేరాలుగా మారాయని.. వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామని డీజీపీ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే ప్రమాదాలపై కూడా పోలీసు శాఖ మరింత దృష్టి సారిస్తుందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్య వస్థీకరణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీని సరైన విధంగా పోలీ స్ శాఖలో వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలపై త్వర లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని.. రిక్రూట్మెంట్, శిక్షణలో మార్పు లు తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. ప్రైవేటు సెక్టార్లో ఉపయోగిస్తున్న ఏఐని పోలీస్ శాఖలో కూడా అమలు చేస్తామని వెల్లడించారు. అధికారులు సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోవధపై పోలీసులే చర్యలు తీసుకుంటారని, ప్రైవేటు వ్యక్తులు రోడ్లపైకి రావొద్దని సీవీ ఆనంద్ హెచ్చరించారు.