మీ సేవలు మరువలేనివి
మంత్రి తుమ్మలకు అభినందనలు వెల్లువ
క్యాంప్ కార్యాలయంలో సందడే సందడి
ఖమ్మం, మే 15(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మీరు చేసిన సేవలు మరువలేనివి.. మంత్రిగా 40ఏళ్ళ పాటు మీరు చేసిన సేవలు, అభివృద్ధి ఖమ్మం జిల్లా దిక్సూచికి కేరాఫ్ గా నిలిచాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడుతున్నారు.
శుక్రవారం మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో తుమ్మల నలబై ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఖమ్మం జిల్లా పలువురు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా తుమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ రామచంద్రుడు ఆశీర్వాదంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని అన్నారు. ఖమ్మం ప్రజలు ఇచ్చిన గౌరవం ప్రతిష్ట కీర్తి నిలబడేలా నా రాజకీయం తప్ప తల దించే పని చేయనని స్పష్టం చేశారు.
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదలు బడుగు వర్గాల వారికి మా కార్యాలయం ఎదురు చూస్తుందన్నారు. నా కోసం నా కుటుంబం కోసం పని చేయనని, నన్ను అక్కున చేర్చుకున్న ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని, శాలువాలతో బోకేలతో నాకు సంతృప్తి ఉండదన్నారు. నా మనుషులు శభాష్ అనేలా పేరు తెచ్చుకుంటే నాకు సంతృప్తి అని, మీరు రూమర్స్ నమ్మొద్దని కోరారు. నేను మొహం మీద అనే అలవాటు ఉందని, ఎందుకంటే నా మనుషులు ఇంకా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నా తపన ఉందన్నారు. నిజాయితీ నిబద్దత గల నాయకులకు ప్రజల ఆదరణ ఉంటుందని సూచించారు. ప్రజా సేవలో నిజాయితీగా తుమ్మల మనుషులుగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.






