తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర 4వ మహాసభల వాల్‌పోస్టర్ల విడుదల
పెబ్బేరు, జూన్ 17: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను బుధవారం పెబ్బేరు హమాలి సంఘం భవనంలో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవన్న మాట్లాడుతూ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20, 21, 22 తేదీలలో మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 20న జరిగే బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, కెవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, శివదాసన్, ఎంపీలు తదితర ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. అదే రోజు మహబూబ్నగర్ టౌన్ హాల్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి, జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ చేపడతామని తెలిపారు.
జూన్ 21, 22 తేదీలలో జరిగే ప్రతినిధుల సభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. కేంద్రం అందించే నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల ఉపాధి హామీ చట్టం అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అన్నారు.
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు బిసన్న, బజారు బాలు, కురుమూర్తి, శివయ్య, వెంకటరాములు, వెంకటేష్, సత్తి, తిరుపతి, దేవి తదితరులు పాల్గొన్నారు.






