హామీల హడావుడి.. అమలులో జీరో!
రైతులు, పేదలు మోసపోయారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెపుతారు
ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం
మాజీ మంత్రి హరీశ్‌రావు
హుస్నాబాద్, జూన్ 17: ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శిం చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సహా అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బలమైన కేడర్, సమర్థ నాయకత్వం, ప్రజలతో అనుబంధం కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులు, యువత, మహిళల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలే బుద్ధి చెపుతారని పేర్కొన్నార. కాగా హుస్నాబాద్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి 20 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఎస్‌ఐఆర్ అత్యంత కీలకమని అన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల్లో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా స్వచ్ఛతకు అత్యంత ప్రాధా న్యం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
హరీశ్ లేఖకు స్పందన
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): పోలవరం ముంపు వల్ల తెలంగాణ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ)కి లేఖ రాశారు. ఈ లేఖపై బుధవారం స్పందించిన పీపీఏ సెక్రటరీ ఎం. రఘురామ్ గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములను కాపాడేందుకు హరీశ్ రావు తీసుకున్న చొరవను అభినందించారు. ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి, తప్పకుండా పరిష్కరిస్తామని అథారిటీ హామీ ఇచ్చారు.
గతంలో 2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ లేఖలో పీపీఏ మరోసారి గుర్తుచేశారు. పోలవరం గరిష్ట నీటిమట్టం (45.72 మీటర్లు) వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రతి ప్రాం తా న్ని పటిష్టమైన ఇంజనీరింగ్ పద్ధతుల్లో రక్షిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అలా రక్షించడం సాధ్యం కాకపోతే, నిబంధనల ప్రకారం ఆ భూమిని సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని రికార్డు పూర్వకంగా మాట ఇచ్చారు.
ప్రాజెక్టును త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు ప్రస్తుతం మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని రకాల సైంటిఫిక్ అంచనాలు, వరద నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటామని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖపై హరీశ్ రావు స్పందిస్తూ.. పొలవరం ముంపు పై తెలంగాణ ఆదినుంచి పడుతున్న ఆందోళన నిజమేనని తేలిపోయిందన్నారు. కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన ఈ హామీలను మా టలకే పరిమితం చేయకుండా అమలు చేయాలన్నారు.






