సోదరి కాలేయ దానంతో అన్నకు పునర్జన్మ
మెడికవర్ హాస్పిటల్స్ అద్భుత చికిత్స
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఒకరికి కొత్త జీవితాన్ని అందించారు. తెల్లాపూర్‌కు చెందిన గోల్ల శంకర్ (50) అనే వ్యక్తి చాలా కాలంగా తీవ్రమైన న్యూరోమస్క్యులర్ వ్యాధి తో పాటు ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా కాలేయ మార్పిడి తప్పనిసరి అయింది. ఈ క్రమంలో ఆయన సోదరి ప్రాణదాతగా ముందుకు వచ్చి తన కాలేయ భాగాన్ని దానం చేశారు. రోగికున్న శారీరక వైకల్యాలు, రక్తనాళాల నిర్మాణంలోని సంక్లిష్టతల వల్ల ఈ ఆపరేషన్ వైద్యులకు పెద్ద సవాలుగా మారింది.
అయినప్పటికీ, హాస్పిటల్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. కిషోర్‌రెడ్డి, ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియాలజిస్ట్ డా. శ్రీకాంత్ నేతృత్వంలోని వైద్య బృందం, నర్సింగ్ సిబ్బం ది సమిష్టి కృషితో ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఆపరేషన్ తర్వాత ఎదురైన కొన్ని ఇన్ఫెక్షన్ సమస్యలను కూడా వైద్యులు సమర్థవంతంగా అధిగమించారు. ప్రస్తుతం ట్రాన్‌ప్లాంట్ జరిగిన మూడు సంవత్సరాల తర్వాత కూడా గోల్ల శంకర్ పూర్తి ఆరోగ్యంతో, సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.






