కర్షకులకు కన్నీళ్లు
- మానుకోట మార్కెట్లో ఈ-నామ్‌కు ఎగనామం
- వాయిదాలకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు
- పట్టించుకోని అధికారులు
మహబూబాబాద్, జులై 29 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి స్పందించిన పంట ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తే ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉండడంతో పాటు మంచి ధర లభిస్తుందని ఆశతో రైతులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కు మిర్చి, మొక్కజొన్న పంట ఉత్పత్తులను విక్రయిస్తే, వాయిదా పెట్టిన వ్యాపారి బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు రైతులు కన్నీరు పెడుతున్నా రు.
జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధా నం (ఈ నామ్ ) అమలు చేస్తున్న మహబూబాబాద్ మార్కెట్లో ఆ విధానాన్ని కొందరు వ్యాపారులు పూర్తిగా తుంగలోకి తొక్కి, రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేసిన వెంటనే డబ్బులు ఇవ్వకుండా వాయిదా పెట్టినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు 8 మంది రైతులు తమకు రావాల్సిన 22 లక్షల రూపాయల కోసం నాలుగు నెలల నుండి మార్కెట్ చుట్టూ తిరుగుతున్నారు.
ఈ నామ్ విధానం అమలు చేస్తున్న మహబూబాబాద్ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులను విక్రయానికి తెచ్చిన రైతుకు ఆన్లైన్ విధానం ద్వారా ముందుగా మార్కెట్లోకి రాగానే గేట్ ఎంట్రీ రిసిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం యార్డులో రైతు తాను తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను రాశిగా పోసిన తర్వాత లాట్ ఎంట్రీ ఇచ్చి ఆన్లైన్ బిడ్డింగ్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారులు రైతులు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి ఆన్లైన్ టెండర్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం టెండర్ ఓపెన్ చేసి అధిక ధర కోట్ చేసిన వ్యాపారికి కేటాయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మార్కెట్ లైసెన్స్ పొందిన దడువాయి చేత ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని తూకం వేయించి, వ్యాపారి నిర్ణయిం చిన ధర ప్రకారం అదే రోజు బ్యాంకు ఖాతా ద్వారా డిజిటల్ లేదంటే చెక్కు ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా మార్కెట్ కార్యదర్శి, సూపర్వైజర్, యాడ్ ఇంచార్జ్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలా ఎవరైనా వ్యాపారి ఖరీదు చేసిన పంట ఉత్పత్తులకు అదే రోజు చెల్లింపులు జరపకపోతే మరుసటి రోజు ఆ వ్యాపారిని వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అనుమతించకుండా నిలిపివేసి, రైతులకు బకాయి పడ్డ చెల్లింపులు పూర్తిచేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో నాలుగు నెలల క్రితం ఓ ట్రేడర్ రైతుల నుండి సుమారు 50 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి, నగదు చెల్లించకుండా వాయిదాలు పెట్టి తిప్పుతున్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా అప్పట్లో సదరు వ్యాపారి నుండి 23 లక్షల వరకు నగదు చెల్లింపులు చేసి మిగిలిన 22 లక్షలకు పైగా నగదును త్వరలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు.
అయితే అధికారులు చెప్పిన గడువు పూర్తి కావడం, అంతలోనే వ్యాపారి బోర్డు తిప్పేయడం తో మిగిలిన ఎనిమిది మంది రైతులు తమ డబ్బుల కోసం మంగళవారం మార్కెట్ కు తాళం వేసి ఆందోళనకు దిగారు. రైతులు పంట ఉత్పత్తులను విక్రయించి నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోకపోవడంతో ఓ రైతు తీవ్ర ఆందోళనకు గురై ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
అధికారులు ఈ నామ్ విధానం పూర్తిగా ఆన్లైన్ సిస్టం అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారి లక్షల రూపాయలు వాయిదా పెట్టి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పటికీ చూసి చూడకుండా వదిలివేయడం వల్లే, ఇప్పుడు రైతులకు తీరని నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదా కొనుగోళ్లకు అధికారులు సహకరించడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, తమకు వ్యాపారి డబ్బులు ఇవ్వడం లేదని అనేక సార్లు మార్కెట్ అధికారులకు, పాలక మండలికి ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ విధానానికి కొందరు వ్యాపారులు ఇదే తరహాలో తూట్లు పొడుస్తూ, అటు మార్కెట్ ఆదాయానికి గండి కొడుతూ, ఇటు రైతులకు శఠగోపం పెడుతున్న వ్యవహారంపై ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మార్కెట్ ను సందర్శించిన డీడీఎం
మహబూబాబాద్ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించిన రైతులకు వ్యాపారి డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన ఘటన నేపథ్యంలో బుధవారం మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మహబూబాబాద్ మార్కెట్ ను సందర్శించారు. వ్యవసాయ మార్కెట్లో మంగళవారం జరిగిన సంఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనామ్ విధానం అమలు చేస్తున్నప్పటికీ రైతులకు డబ్బులు చెల్లింపుల్లో ఎందుకు జాప్యం జరిగిందనే అంశంతో పాటు మార్కెట్ లో వ్యాపారి కొనుగోళ్ల తీరును రికార్డులను పరిశీలించారు. కాగా బాధిత రైతులకు చెల్లించాల్సిన బకాయి పడ్డ వ్యాపారి ఆస్తుల్లో కొంత విక్రయించి రైతులకు ఇప్పించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారని, నెల రోజుల్లో రైతులకు బకాయి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింప చేశారు.






