08-02-2026 01:20:08 AM
భారత్‌ను కంగారు పెట్టిన యూఎస్‌ఏ
సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్
రాణించిన సిరాజ్, అర్షదీప్
టీ20 ప్రపంచకప్
టీ20 ఫార్మాట్ అంటేనే ఏ జట్టు ఎలా ఆడుతుందో చెప్పలేని పరిస్థితి.. ఇది మరోసారి రుజువైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ హోదా.. ప్రత్యర్థి పసికూన యూఎస్‌ఏ.. ఇంకేముంది ఇటీవలి ఫామ్ చూసి భారత్ బ్యాటర్ల విధ్వంసం ఖాయమని అనుకున్నారు. కట్ చేస్తే పవర్ ప్లేలోనే 4 వికెట్లు డౌన్...77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి న వైనం... ఈ దశలో సూర్యాభాయ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కాపాడాడు. తర్వాత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో యూఎస్‌ఏ చాపచుట్టేసింది.
ముంబై, ఫిబ్రవరి 7 : డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో యూఎస్‌ఏను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో తడబడినా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. అటు బౌలింగ్‌లో సిరాజ్, అక్షర్ పటేల్ రా ణించడంతో భారత్ గెలుపుతో టోర్నీని ఘ నంగా ఆరంభించింది. ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో కీలక మార్పులు జరిగాయి. ఊహించినట్టుగానే ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
అ లాగే బుమ్రా జ్వరంతో బాధపడుతుండడం తో రెస్ట్ ఇచ్చారు. హర్షిత్ రాణా స్థానం లో ఎంపికైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరా జ్ ఆటోమేటిక్‌గా తుది జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు యూఎస్‌ఏ బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. విధ్వంసం సృష్టిస్తారనుకున్న భారత్‌ను ఆరంభం నుంచే వికెట్లు తీసి దెబ్బకొట్టారు. అభిషేక్ శర్మ(0) డకౌటవగా... ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన ఇషాన్ కిషన్ 20 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో తిలక్ వర్మ(25) కూడా పెవిలియన్ చేరాడు.
అటు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కించుకున్న శివమ్ దూబే కూడా డకౌటయ్యా డు. దీంతో భారత జట్టు పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులే చేసింది. ఈ దశలో సింగిల్స్ వస్తే చాలు.. వికెట్ పడకుంటే చాలు అనుకుం టూ ఉన్నారు. ఇక్కడ నుంచి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న కెప్టెన్ సూర్యకుమా ర్ యాదవ్ కాస్త ఆచితూచి ఆడాడు.మరోవైపు రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా కూడా నిరాశపరచడంతో మరో 2 వికెట్లు చేజారిపోయాయి.
దాంతో టీమిండియా 77 పరుగు లకే 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమయ్యే లా కనిపించింది. ఒక దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. అ యితేకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్ కలిసి 41 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ ఔటైనప్పటకీ.. మిగిలిన టెయిలెండర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోరు పెంచాడు. భారీ షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ ఆడి కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. యూఎస్‌ఏ బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో యూఎస్‌ఏ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది.
ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞులైన భారత బౌల ర్ల ముందు తోక ముడిచారు. సిరాజ్ , అర్షదీప్ సింగ్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి అమెరికా పతనాన్ని శాసించారు. మిలింద్ కుమా ర్ (34) , సంజయ్ (37), శుభమ్ (37) పరుగులతో రాణించగా.. మిగిలిన వారంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 3 , అర్షదీప్ 2 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 161/9 ( సూర్యకుమా ర్ 84 , తిలక్ 25, ఇషాన్ 20; షాడ్లీ 4/25, హర్మీత్‌సింగ్ 2/26, అలీ ఖాన్ 1/13)
యూఎస్‌ఏ ఇన్నింగ్స్ : 132/8 ( శుభమ్ 37 , కృష్ణమూర్తి 37, మిలింద్ 34; సిరాజ్ 3/29, అక్షర్ 2/34 , అర్షదీప్ సింగ్ 2/18)