30 May, 2026 | 12:33 AM

టీచర్లు టెట్ పాస్ కావాల్సిందే!

30-05-2026 12:09 AM
  1. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
  2. అర్హత గడువును 2 నుంచి 3 ఏళ్లకు పెంపు
  3. మినహాయింపు పిటిషన్ల కొట్టేవేత

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): టీచర్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (కేటెట్)లో ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయులను తొలగించాలని గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఇచ్చిన గడువును మాత్రం రెండు సంవత్సరాల నుంచి మూడేళ్లకు పొడిగించింది.

అంటే 2027 నుంచి 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఓపెన్ కోర్ట్ విచారణ అనంతరం ఈ రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేరళ ప్రభుత్వంతోపాటు వివిధ సంస్థలు దాఖలు చేసిన సుమారు 45 రివ్యూ పిటిషన్లను కోర్టు పరిశీలించింది. పిటిషనర్లు ప్రధానంగా 2012 మార్చి 31కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. టెట్‌ను వారికి తప్పనిసరి చేయకూడదని, వారు పదవీ విరమణ వరకు సేవలో కొనసాగేందుకు అనుమతించాలని వాదించారు.

అయితే, సుప్రీంకోర్టు తన పూర్వ తీర్పును పునఃపరిశీలించేందుకు నిరాకరించింది. టెట్ అనేది బాలల బోధనా విధానం, బోధనా నైపుణ్యాలను అంచనా వేసే అర్హత పరీక్ష అని, అందువల్ల అన్ని పాఠశాల ఉపాధ్యాయులు ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందేనని కోర్టు పేర్కొంది. సీటెట్, మహారాష్ట్ర, కేరళ టెట్ ఇలా పలు రాష్ట్రాల నుంచి స్వీకరించిన, ప్రైవేట్ వ్యక్తుల నుండి స్వీకరించిన మొత్తం 45 రివ్యూ పిటీషన్‌లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 

తెలంగాణ టీచర్లకు షాక్

సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ టీచర్లు షాక్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ఇన్ సర్వీస్ టీచర్లు 2010కి ముందు నియామకం అయిన ఉపాధ్యాయుల్లో దాదాపు 50 వేల మంది టెట్ పాస్ అయ్యారు. మరో 20 వేల మంది టెట్ పాస్ కావాల్సి ఉంది. ఇక 2012 డీఎస్సీ, 2017 డీఎస్సీ, 2024 డీఎస్సీలో నియామకమైన టీచర్లు టెట్ పాసైన వారే. 2010 కంటే ముందు నియామకం అయినా టీచర్లలో 50 వేల మంది టీచర్లు టెట్ పాస్‌కాగా, మరో 20 వేల మంది టెట్ పాస్ కావాల్సి ఉంది.