సాకర్ కిక్కు!
తెల్లవారుజాము వరకు బార్లు, క్లబ్బుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఫిఫా వరల్డ్ కప్ క్లైమాక్స్‌కు చేరడంతో లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించే సాకర్ ప్రియులు, మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రోజులపాటు బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు అదనపు వేళలకు అనుమతులిచ్చింది. రెండు రోజులు తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీచేసింది. ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ జరిగే జూలై 18న అర్ధరాత్రి నుంచి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అంటే జులై 19 తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.
ఇక సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే జులై 19న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున అంటే 20వ తేదీ ఉదయం 3 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పించింది. అయితే, ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక అర్ధరాత్రి సమయాల వెసులుబాటు కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.






