18 July, 2026 | 2:20 AM

సాగునీరు విడుదలలో ప్రభుత్వం విఫలం

18-07-2026 02:20 AM

బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి హనుమంతు నాయుడు

గద్వాల, జూలై 17 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలంలోని ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ల కింద ఉన్న కాలువలను బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పార్టీ నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.

అనంతరం రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, జూరాల రైట్ మెయిన్ కెనాల్ పరిస్థితిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ, రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాలువల్లో పెరిగిన చెట్లను తొలగించకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు.

రైతులు పంటలు వేసుకునేందుకు వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు రెండు పంటలకు సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కూలీలు, వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.