18 July, 2026 | 1:30 AM

పంద్రాగస్టు నాటికి యూనిఫాం

18-07-2026 01:20 AM
  1. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు 
  2. నాణ్యతకు పెద్దపీట.. ఎక్కడికక్కడ వస్త్రం ఎస్‌హెచ్‌జీలకు అందజేత
  3. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున అందించేందుకు ఏర్పాట్లు
  4. వస్త్రం ఎంపిక, సరఫరా, కుట్టుపనిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులందరికీ పంద్రాగస్టు నాటికి యూనిఫాం అందించాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. నాణ్యత విషయంలో రాజీ లేకుండా యూనిఫాం సిద్ధం చేయిస్తున్నది. వస్త్రం ఎంపిక, సరఫరా నుంచి కుట్టుపని వరకు ప్రతి అంశంపై నజర్ వేసింది. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫా అందనుంది. అందుకు ఇప్పటికే 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు చేసింది.

మఫత్లాల్ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, రాష్ట్ర చేనేత సహకార సంస్థ 55.32 లక్షల మీటర్ల వస్త్రం సరఫరా చేస్తున్నాయి. ఈ వస్త్రాన్ని సర్కార్ ఎక్కడికక్కడ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టిస్తున్నది. ఒక్కో యూనిఫాంకు ప్రభుత్వం రూ.75 చెల్లిస్తున్నది. రాష్ట్రంలో మహిళా సంఘాలకు రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యూనిఫాంల కుట్టుపని జోరందుకుంది.

ఆగస్టు 15 నాటికి అన్ని పాఠశాలలు.. గురుకులాలకు అందజేయడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని 85 వేల మంది విద్యార్థినులకు మన్నికైన యూనిఫాం చేరింది. పాఠశాలలు, గురుకులాలకు ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో యూనిఫాంలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా, మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రాండెడ్ షూ, సాక్సులు, టై, బెల్టులు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు పూర్తి నాణ్యత ప్రమాణాలతో కూడిన యూనిఫాంతో పాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా అందిస్తున్నది. పలు మైనారిటీ కళాశాలల్లో విద్యార్థులకు యూనిఫాంతో పాటు టై, బెల్టులు, సాక్సులు ఇప్పటికే అందాయి. గతంలో పాఠశాల విద్యా విభాగం, ఏ గురుకుల విభాగానికి ఆ గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామగ్రి వేర్వురుగా కొనుగోలు చేసి అందజేసేవి. దాంతో అనేకరకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. కొన్ని పొరపాట్లు జరిగేవి. ఆ సమస్యలను అధిగమించి సామగ్రి సేకరణ.. పంపిణీ ఒకే విధంగా ఉండేలా ఈ ఏడాది ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ తీసుకువచ్చింది. ఇందుకోసం రూ.687.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టే అభివృద్ధి వ్యయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. 

విద్యార్థులకు కిట్లు ఇలా...

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సామగ్రితో కూడిన కిట్‌ను ప్రభుత్వం అందజేస్తోంది. తెల్లని బూట్లు, తెల్లని సాక్సులు ఉంటాయి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, పట్టణ గురుకుల పాఠశాలల విద్యార్థులకు బెల్టు, ఐడీ కార్డు, టై, స్కూల్ బ్యాగు, బూట్లు (నలుపు, తెలుపు  సాక్సులతో), బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా, ట్రంక్ బాక్సు, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ తో కూడిన సంపూర్ణమైన కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు తొలిసారిగా ట్రాక్ సూట్, నైట్ డ్రెస్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాలల్లోని విద్యార్థులకు తొలిసారిగా నల్లటి బూట్లు, బెల్టును ప్రభుత్వం అందజేస్తోంది. ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోని సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లటి బూట్లు, సాక్సులు అందజేస్తోంది. విద్యార్థులకు యూనిఫాంతో పాటు అందజేసే కిట్‌లోని  ప్రతి ఒక్కటి నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ టెండర్లను పిలిచింది. మిగిలిన ఆర్డర్లను  టీజీఎస్ సీఓ, టీజీఎల్ ఐపీసీ, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది.

కార్పొరేషన్‌లకూ ఆదాయం

యూనిఫాం, బెడ్డింగ్ ఆర్డర్లలో 25 శాతం తెలంగాణచేనేత కార్మికుల సహకార సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనిలో 25 శాతం యూనిఫాం వస్త్రం (సుమారు 56 లక్షల మీటర్లు), 100 శాతం దుప్పట్లు (6,49,381), 3 లక్షల బెడ్‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు ఉన్నాయి. ఈ ఆర్డర్‌తో చేనేత కార్మికులకు ఆదాయం సమకూరనుంది. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్‌ను రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్‌కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ ఆర్డర్‌తో సంస్థ బలోపేతం కానుంది.