శిథిల దశలో తాడ్వాయి బస్టాండ్
- పెచ్చులూడుతున్న పైకప్పు
- దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలు
- పట్టించుకోని అధికారులు
తాడ్వాయి,జూలై,17(విజయ క్రాంతి ): ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక బస్టాండులను నిర్మించింది. ప్రయాణికులు రోడ్లపై బస్సుల కోసం వేచి ఉండి ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో బస్టాండ్లను ఏర్పాటు చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన బస్టాండ్లు శిథిలదశకు చేరుకుంటున్నాయి.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు పక్కనే సువిశాలమైన ప్రదేశంలో బస్టాండును నిర్మించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు ఆ బస్టాండ్ శిథిలదశకు చేరుకుంటుంది. బస్టాండును పట్టించుకునే వారే కరువవడంతో బస్టాండ్ పరిసరాలు దుర్గంధమయంగా మారాయి.బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారం పేరుకు పోయి ఉంది.చిన్న చిన్న పొదలతో ఆవరణమంతా నిండిపోయింది.
పెచ్చులూడుతున్న పైకప్పు..
బస్టాండ్ లో అధికారులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ పైకప్పు పెచ్చులూడి పోతుంది. బస్టాండ్ లో ఏర్పాటు చేసిన దుకాణ సముదాయాలు శిథిలమవుతున్నా యి. షెటర్లు వంగిపోయి ఉన్నాయి.బస్టాండ్ ఆవరణలోని నేలభాగమంతా శిథిలమై ఉంది. ఎవరు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ జులాయిలకు అడ్డగా మారింది.
35 ఏళ్ల క్రితం బస్టాండ్ నిర్మాణం..
గత 35 సంవత్సరాల క్రితం తాడ్వాయి మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ బస్టాండ్ పూర్తయిన సమయంలో ప్రయాణికులతో రద్దీగా ఉండేది. తాడువాయి బస్టాండు చాలా గ్రామాలకు కూడలిగా ఉంది. ఇక్కడి బస్టాండ్ నుంచి మండలంలోని సంతాయిపేట, చందాపూర్, బ్రాహ్మణపల్లి,కరడ్పల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడ వేచి ఉంటారు. బస్టాండ్ శిథిల దశకు చేరడంతో బస్సులు బస్టాండ్ లోపలికి రావడం లేదు.
దీంతో ప్రయాణికులు రోడ్డుపై నిలిచండి వానలో నానిపోతూ ఎండలో ఇబ్బందులు పడుతూ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండుకు మరమ్మతు నిర్వహించి బస్టాండును ఉపయోగ తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.






