టీజీ20 లీగ్‌తో రూ.150 కోట్ల స్కాంకు కుట్ర
హెచ్‌సీఏపై టీసీఏ ఆరోపణలు
బీసీసీఐకి సంచలన నివేదిక
సీఐడీ విచారణకు డిమాండ్
హైదరాబాద్, మే 21: అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రస్తుత పాలకవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ క్రికె ట్ అసోసియేషన్ (టీసీఏ) డిమాండ్ చేసింది. హెచ్‌సీఏలో గత కొంతకాలంగా జరిగిన, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి బీసీసీఐకి సంచలన నివేదిక సమర్పించారు. హెచ్‌సీఏలో పాలనా వ్యవస్థ పూర్తిగా పతనమైందనీ, క్రికెట్ పరిపాలనలోకి నేరస్థులు చొరబడ్డారని ఆరోపించారు.
హెచ్‌సీఏ ప్రతిపాదిత టీజీ20 లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, అనధికారిక ఫ్రాంచై జీల ఏర్పాటు కార్యకలాపాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. గతంలో జ మ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్న తరహాలోనే ఇక్కడ కూడా ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించాలని టీసీఏ బీసీసీఐని కోరింది.
ఆర్థిక మోసాలు, నమ్మకద్రో హం వం టి తీవ్రమైన ఆరోపణలపై జరుగుతున్న సీఐడీ విచారణను టీసీఏ తన నివేదికలో ప్రస్తావించింది. ఇటీవల జరిగిన హెచ్‌సీఏ ఎన్నికలపై కూడా టీసీఏ తీవ్రమైన ఆరోపణలు చేసిం ది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎన్నికల చెల్లదనీ, అలాగే అగం రావును స్వయం ప్రకటిత గవర్నింగ్ కౌన్సి ల్ ఛైర్మన్‌గా నియమించడాన్ని టీసీఏ తప్పుబట్టింది.
అలాగే ప్రతిపాదిత టీజీ20 లీగ్ ద్వారా మూడేళ్ల సైకిల్‌లో దాదాపు రూ.120 నుంచి 150 కోట్ల విలువైన థర్డ్-పార్టీ ఫ్రాంచై జీ హక్కులను సృష్టించడానికి హెచ్‌సీఏకు అనుమతి ఇవ్వవద్దని టీసీఏ బీసీసీఐని కోరింది. హైదరాబాద్ వెలుపల హెచ్‌సీఏకు ఎటువంటి క్రికెట్ పరిపాలనా నిర్మాణం లేదని తెలిపింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ మౌలిక సదుపాయాలు , ఆటగాళ్ల అభివృద్ధి అంతా టీసీఏ కార్యక్రమాల ద్వారానే జరిగిందని స్పష్టం చేసింది.






