calender_icon.png 9 February, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళమే వారధి

09-02-2026 01:17:44 AM

  1. భారత్--మలేషియా మధ్య శతాబ్దాల అనుబంధం
  2. భారత సంతతి ప్రజలు, తమిళుల అభ్యున్నతికి సహకరిస్తాం
  3. మలేషియా పర్యటనలో ప్రధాని మోదీ
  4. ఇరుదేశాల మధ్య  11 కీలక ఒప్పందాలు

కౌలాలంపూర్, ఫిబ్రవరి ౮: తమిళ భాష, సంస్కృతిపై ఉన్న ఉమ్మడి అభిమానం భారత్ - మలేషియాని ఏకం చేస్తోందని, రెండు దేశాల మధ్య తమిళ భాష వారధి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆదివా రం మోదీ అక్కడి ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొత్తం ౧౧ ఒప్పందాలు చేసుకుని, ఇరువైపులా అధికారికంగా ప్రకటించారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. మలేషియా విద్యా వ్యవస్థ, మీడియా, సాంస్కృతిక రంగం.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతి రంగంలోనూ తమిళ సంస్కృతి ప్రభావం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కేవలం దౌత్యపరమైన సంబంధాలే కాకుండా, శతాబ్దాల నాటి సాంస్కృతిక అనుబంధం సైతం కలిపి ఉంచుతోందని అభిప్రాయపడ్డారు.

అనంతరం ఏర్పాటు చేసిన విందులో ‘నాళై నమదే’ అనే తమిళ నటదిగ్గజం నటించిన ఎంజీఆర్ పాటను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్లే చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. మలేషియాలో నివసిస్తున్న 30 లక్షల మంది భారత సంతతి ప్రజలతోపాటు తమిళుల అభ్యున్నతికి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. భేటీలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, ముహమ్మద్ హసన్, ఇతర రాయబార ప్రతినిధులు పాల్గొన్నారు.

11 ఒప్పందాలు ఇవే..

* ఆడియోవిజువల్ కో-పొడక్షన్ ఒప్పందం

భారత్- మలేషియా దేశాల సినీ పరిశ్రమ లు కలిసి సినిమాలు నిర్మించొచ్చు. వనరులను పంచుకోవడం ద్వారా రెండు దేశాల సంస్కృతిని విస్తరించవచ్చు.

* విపత్తు నిర్వహణ సహకారం

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇరువైపుల నుంచి సహాయక చర్యలు, పునరావాసం, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవచ్చు.

* అవినీతి నిరోధక ఒప్పందం

మలేషియా యాంటీ కరప్షన్ కమిషన్, భారత సీబీఐ మధ్య కుదిరిన ఈ ఒప్పం దం ద్వారా అవినీతిపరుల గుర్తింపు, అవినీతి నివారణలో సమాచార మార్పిడి చేసుకోవచ్చు.

* ఐక్యరాజ్యసమితి - శాంతి పరిరక్షణ

అంతర్జాతీయంగా శాంతి భద్రతల స్థాపనకు ఐక్యరాజ్యసమితి శాంతి బృందాలకు పరస్పర సహకారం

* సెమీ కండక్టర్ల రంగంలో సహకారం

గ్లోబల్ సప్లై చైన్‌ను బలోపేతం చేయ డం, ఉపాధి అవకాశాల కల్పనకు సెమీకండక్టర్ల తయారీకి సాంకేతిక సహకారం

* ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ కూటమి

పులులు వంటి ‘పెద్దపిల్లి’ జాతుల సంరక్షణకు భారత్ ప్రారంభించిన కూటమిలో మలేషియా కూడా భాగస్వామి

* సామాజిక భద్రతా ఒప్పందం

మలేషియాలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి సామాజిక భద్రతా పథకాల్లో పరస్పర సహకారం 

* వృత్తి విద్యా శిక్షణ 

యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపెనుకు వృత్తి విద్యా రంగంలో పరస్పర సహకారం

* భద్రతాపరమైన సహకారం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం, పరస్పర సహకారంతో కొత్త రకపు భద్రతా సవాళ్లను ఎదుర్కొనే ఒప్పందం

* వైద్యారోగ్య రంగం

ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం, ఆరోగ్య రంగంలో పరిశోధనలు, సామర్థ్యాల పెంపు

* ఆయుర్వేద పరిశోధన ఒప్పందం

ఇది యూనివర్సిటీ ఆఫ్ సైబర్జయ, భారత ఆయుర్వేద శిక్షణా పరిశోధనా సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. దీని ద్వారా సంప్రదాయ వైద్యంలో విస్తృత పరిశోధనలకు పరస్పర సహకారాలు అందుతాయి.