21 March, 2026 | 5:00 AM

మా కుటుంబాన్ని బాగా చూసుకోండి

21-03-2026 12:00 AM

‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో భూమా పాత్రలో మెప్పించిన రష్మిక మందన్న ‘ఉత్తమ నటి’గా తెలంగాణ అత్యున్నత పురస్కారమైన గద్దర్ సినీ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు దక్కిన ఆనందాన్ని రష్మిక సామాజిక మాధ్యమాల వేదిగా పంచుకున్నారు. గద్దర్ అవార్డు పట్టుకొని దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో రష్మిక, ఆమె అత్త మాధవి దేవరకొండ ముఖాల్లో ఎంతో ఆనందంగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా ఆమె రాసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. “నేను చిన్నప్పుడు ఎవరైనా రాష్ట్రస్థాయి విజేతగా నిలిస్తే, నేను వారిని సూపర్ స్టార్‌లా చూసేదాన్ని. ‘వాళ్లు అలా ఎలా సాధించారు? వాళ్లు రోజంతా ఏం చేస్తుం టారు?’ అని  ఆశ్చర్యపోయేదాన్ని. ఇప్పు డు ఒక రాష్ట్రస్థాయి అవార్డును అందుకోవడం నాకు అత్యంత ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది.

ఆ భావాలను మాటల్లో వర్ణించగలనని అనుకోను. కానీ నేను చాలా దూరం ప్రయాణించి, ఎంతో ఎత్తుకు ఎదిగానని అనిపిస్తోంది! నాలో ఒక రకమైన గర్వం, సంతోషం, సంతృప్తి వంటి భావాలు కలిగాయి. ఈ కొత్త సంవత్సరం ఎంతో అందంగా ప్రారంభమైంది. ఒక రాష్ట్రస్థాయి అవార్డుతో తెలంగాణలో స్వాగతం లభించడం మరింత ప్రత్యేకమైన విషయం. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. 

రష్మిక అత్త మాధవి భావోద్వేగం..

గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవానికి రష్మిక వెంట ఆమె అత్త మాధవి దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై తన కోడలు రష్మిక ప్రసంగిస్తుంటే చూస్తూ, ఎంతో మురిసిపోయారామె. ‘ఒకప్పుడు నా నటనపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వచ్చేవి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నా నటనను మెచ్చి పురస్కారం ఇచ్చింది. ఓ రోజు ఒక కూతురిలా తెలంగాణలో అడుగుపెట్టిన నాకు ఇన్ని రోజులుగా ఎంతో ప్రేమ పంచారు.

ఇప్పుడు కోడలిలా ఈ గడ్డపై నిల్చున్నా. మా కుటుంబాన్ని బాగా చూసుకోండి’ అంటూ వేదికపై రష్మిక చెప్పిన మాటలు వింటూ మాధవి ఒకింత గర్వంతో భావోద్వేగానికి గురవుతూ, ఆనంద బాష్పాలు కార్చారు. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. తన భర్త విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం ప్రధానమైంది.

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇంకా రష్మిక ‘మైసా’లో ఆమె ఓ గిరిజన మహిళగా మెప్పించనుంది. హిందీలో షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్‌టెయిల్ 2’ చిత్రం కూడా విడుదల కావాల్సి ఉంది.