21 March, 2026 | 1:35 AM

నిశ్శబ్దం వీడేది ఆ రోజే!

21-03-2026 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిరుడు ‘ఘాటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె తనదైన శైలిలో పుల్‌స్టాప్ పెట్టింది. పెళ్లి వార్తలపై మౌనం వహిస్తూనే తన తదుపరి భారీ ప్రాజెక్టు ‘కథనార్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారామె. అనుష్క తన సోషల్ మీడియాలో ఒక భయంకరమైన నీలిరంగు కన్ను ఉన్న పోస్టర్‌ను షేర్ చేసింది.

దీనికి ‘సైలెన్స్ బ్రేక్.. ఇంతకుముందెన్నడూ లేనంత బిగ్గరగా అప్డేట్ రాబోతుంది’ అంటూ పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు. మార్చి 31న ఈ సినిమా నుంచి ఒక భారీ సర్‌ప్రైజ్ ఉండనున్నట్లు అనుష్క ప్రకటించారు. ఈ పోస్టర్ చూస్తుంటే అనుష్క మళ్లీ ఒక హారర్ లేదా ఫాంటసీ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి కథానాయికగా నటిస్తోంది.

రోజిన్ థామస్ దర్శకత్వంలో గోకులం గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 9వ శతాబ్దం కాలానికి సంబంధించిన కథాంశంతో, తాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక రహస్యాలు, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కేరళ జానపద గాథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మరో ‘అరుంధతి’ స్థాయి విజయం సాధిస్తుందన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.