28 August, 2026 | 8:19 AM

రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ

27-08-2026 11:03 PM

మాచారెడ్డి విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

కామారెడ్డి,(విజయ క్రాంతి): మాచారెడ్డి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం  నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పీఏసీఎస్‌ చైర్మన్‌గా నౌసిలాల్‌ నాయక్‌ ప్రమాణ స్వీకారం చేయగా, నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రైతులకు అవసరమైన రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని షబ్బీర్‌ అలీ అన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నూతన చైర్మన్‌ నౌసిలాల్‌ నాయక్‌ రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలు అందించాలని సూచించారు. మాచారెడ్డి మండల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని షబ్బీర్‌ అలీ హామీ ఇచ్చారు.