28 August, 2026 | 4:29 AM

వాటర్ షెడ్‌లతో పెరగనున్న భూగర్భ జలాలు

28-08-2026 12:00 AM

ప్రాజెక్టు పనులను ప్రారంభించిన కలెక్టర్

ఉట్నూర్, ఆగస్టు 27 : భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ, అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కార్యక్రమానికి ముందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ నిర్వహణను పరిశీలించి అభినందించిన కలెక్టర్, అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్కనాటి నీరు పోశారు. ఈ మొక్కకు గ్రామస్తులు కలెక్టర్ పేరుతో నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో  ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్డీ జాబితాలను బిఎల్‌ఓ లక్ష్మీ చదివి వినిపించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ, గుంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశలవారీగా విస్తరించబడుతుందని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు రెండు పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్ పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు.

అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కోసం కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్మెంట్ చార్జీలు లేకుండా కేవలం రూ. 9,150 చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు. చివరి ఇళ్లకు సైతం తక్కువ ఖర్చుతో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చే యించుకోవచ్చని వెల్లడించారు. హస్తాపూర్ - నార్నూర్ రహదారి పనులతో పాటు పెండింగ్లో ఉన్న రోడ్లకు త్వరలో నిధులు మంజూరు చేయడం,

గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్టి ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, పాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడం, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కా ర్యక్రమంలో నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రఫ్, ధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నీలేష్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లరావు, ఏంఆర్‌ఓ రాజలింగు, ఏంఈఓ మనోహర్, డిఎల్పిఓ ప్రభాకర్, సర్పంచ్ జ్ఞానేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు రామారావు, పంచాయతీ కా ర్యదర్శి రాధిక, బిఎల్‌ఓ లక్ష్మీ, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.