6 June, 2026 | 8:45 PM

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనతో సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గౌరవం

06-06-2026 07:23 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట,(విజయక్రాంతి): ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనతోనే సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో విశేష గౌరవాన్ని దక్కించుకుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో జిల్లా ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యదితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి, పారిశుధ్యం, ఓటరు నమోదులపై అవగాహన కల్పించారు. సూర్యాపేటను ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మార్చేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

పట్టణంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇటుకలను తయారు చేస్తూ, దీనిని నిరంతరం కొనసాగే ఒక స్థిరమైన వ్యవస్థగా మార్చడం శుభపరిణామమని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్య సిబ్బంది  కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. సూర్యాపేటలో పారిశుద్ధ్యం కోసం అమలు చేస్తున్న విధానాలతో భవిష్యత్తులో పారిశుధ్య విభాగంలో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిలో భాగంగానే సఖి, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళల రక్షణకు విశేషమైన కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షఫీ ఉల్లా, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ రావు, వార్డ్ కౌన్సిలర్ షేక్ జహీర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి డాక్టర్ అమూల్య, మున్సిపల్ కిరణ్ కుమార్  ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.