25 June, 2026 | 2:30 AM

ఉద్యోగాలు ఇవ్వకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం

25-06-2026 12:58 AM

-19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి

బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు

ఎల్బీనగర్, జూన్ 24(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని.. ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 46 వల్ల పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు వేల పోస్టులతో సరిపెట్టకుండా 19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు, 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

నిరుద్యోగ సమస్యపై డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, రెండు లక్షల ఉద్యో గాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. జీవో 46ను సవరిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పుల్లారావు యాదవ్, అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నర్సింహ రెడ్డి, నిరుద్యోగుల జేఏసీ నాయకులు అనితారెడ్డి, భూక్యా కుమార్, ఆకాశ్‌గౌడ్, సంధ్య పాల్గొన్నారు.