4 May, 2026 | 3:53 AM

ఆదివారం.. ఆసుపత్రికి సెలవు..

04-05-2026 02:50 AM
  1. నిబంధనలు గాలికి...
  2. అంతా మా ఇష్టం..
  3. అడిగేది ఎవరు...?
  4. ఆదివారం ఆసుపత్రికి తాళాలు..
  5. పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, మే మే3( విజయ క్రాంతి ): ఆదివారం ఆసుపత్రికి సెలవు అన్న రీతిగా ఆసుపత్రి అధికారుల వ్యవహారం ఉంది. నిర్లక్ష్యం... అంతా నిర్లక్ష్యం... మమ్మల్ని అడిగేది ఎవరు... అన్న ధీమాతో ఆసుపత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఆసుపత్రిని తెరిచి ఉంచాలి,వచ్చిన రోగులకు చికిత్సలు చేయాలి అనే నిబంధనలు ఉన్న ఆ నిబంధనలను గాలికి వదిలేసి ఆసుపత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సిబ్బందికి మంచి జీతాలు ఇస్తున్న వారు లక్షణంగా పనిచేయడం లేదు.ఇంత అద్వాన్న స్థితిలో ఆసుపత్రి పని చేయడం మేము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.మమ్మల్ని ఎవరు అడుగుతారు... అన్న ధీమాతో సిబ్బంది పనిచేస్తున్నారు.మేము ఎవరికీ బాధ్యతగా పని చేస్తాం.. మాకు అవసరం ఏమిటి అన్న రీతిగా అధికారుల తీరు ఉంది.

వివరాలు ఇలా ఉన్నాయి....కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం తాళాలు వేసి ఉన్నాయి.ఏది ఏమైనా పై అధికారుల నిర్లక్ష్యపు ధోరణి కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రుల తీరు గందరగోళంగా మారింది.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం నెలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను కొనసాగిస్తుంది.కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పక్కనే ఉన్న హోమియోపతి వైద్యశాలకు సైతం తాళాలు వేసి ఉన్నాయి.

ఆసుపత్రికి అధికారులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో సైతం అధికారులు నామమాత్రపు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి అడిగిన సమాధానాలు సరిగ్గా చెప్పడం లేదని నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ఆసుపత్రి..

- - ఎర్రపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఎంతో ప్రాచుర్యంలో ఉండేది. ఇక్కడ గతంలో ఇద్దరు వైద్యాధికారులు విధులు నిర్వహించేది.ప్రస్తుతం ఇద్దరు వైద్యాధికారుల పోస్టులు ఉన్న ఒకే ఒక వైద్యాధికారి విధులు నిర్వహిస్తున్నారు.ఒక పోష్టు ఖాళీగానే ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి పీజీ కోసం వెళ్ళినట్లు వైద్యాధికారులు తెలిపారు.ఇక్కడ ఇద్దరు వైద్యాధికారులు విధులు నిర్వహించాల్సి ఉన్న ఒకరు మాత్రమే ఉంటున్నారు.

ఆసుపత్రి పై అధికారుల పర్యవేక్షణ కరువు..

- - ఎప్పటికప్పుడు ఆసుపత్రి ని పర్యవేక్షించాల్సిన పై అధికారులు పర్యవేక్షించకపోవడంతోనే ఆసుపత్రి ఇలా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పై అధికారులు ఆసుపత్రి వైద్యాధికారులను  నియంత్రించ లేకపోవడంతోనే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడితే ఎక్కడికి వెళ్లాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి ఆదివారం ఇలాగే తాళాలు వేసి వెళ్ళిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన వైద్యాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు . మరో బాధ్యతాయుతమైన అధికారి హెచ్‌ఈఓ నారాయణ పూర్తిగా బాధ్యతారహితంగా పనిచేస్తున్నారు.ఆయన హైదరాబాదు నుంచి ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తూ విధులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదేమిటి మీరు ఆసుపత్రిలో ఉండటం లేదు కదా అని స్థానికులు హెచ్ ఈ ఓ నారాయణ ను ప్రశ్నించగా మీకేం అవసరం నా విధులు ఇంతే అని ఘాటుగా సమాధానం చెబుతూ దాటవేస్తున్నారని స్థానికులు ఆయన తీరుపై మండిపడుతున్నారు.ఆయన విధులకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల రైలుకు హైదరాబాదుకు వెళ్ళిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.లక్షల్లో జీతాలు తీసుకున్న అధికారులు ఇంత నిర్లక్ష్యంగా పనిచేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మిగతా రోజుల్లోనూ నిర్లక్ష్యపు ధోరణే...

- - ఒక్క ఆదివారమే కాకుండా మిగతా రోజుల్లోనూ అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎర్ర పహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో దూరపు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి చికిత్సలు నిర్వహించుకుంటారు. గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్,కరడుపల్లి, బ్రాహ్మణపల్లి తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి చికిత్సలు నిర్వహించుకుంటారు. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 

అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు..

ఎర్ర పహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆసుపత్రిని తీయడం లేదు. అసలు వైద్యులు ఎప్పుడొస్తున్నారో..ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోగులకు మెరుగైన చికిత్సలు అందించడం లేదు.పేదలు ఇబ్బందులు పడుతున్నారు.ఎర్రపహాడ్ లో ఇద్దరు వైద్యాధికారులు ఉండాలి. కానీ ఒక్కరే ఉంటున్నారు. ఒకరు సెలవు పైన లేదా డిప్యూటేషన్ పైన వెళ్తున్నారు.

ఇది సరైన విధానం కాదు. ఇక్కడ అధికారులు ఇద్దరు డాక్టర్లను నియమించాలి. ఇద్దరే కాకుండా మరో ఇద్దరు డాక్టర్లను ఏర్పాటు చేయాలి అధికారులు ఇలా నిర్లక్ష్యం చేస్తే ఆందోళన నిర్వహిస్తాం. ప్రభుత్వం ఎర్రపాడు ఆసుపత్రికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది అయినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోతుంది. ఆదివారం ఆసుపత్రికి తాళాలు వేసి ఉంచుతారా రోగులు ఎక్కడికి వెళ్లాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి 

- చిట్యాల సాయన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు 

హెచ్‌ఈఓ నారాయణ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు...

హెచ్ ఈ ఓ నారాయణ హైదరాబాదు నుంచి ఆసుపత్రికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంత నిర్లక్ష్యంగా పనిచేయడం ఏమిటి ? అధికారులు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.ఆయన ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఆయన సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాలి. లేనియెడల నారాయణపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.

- మైపాల్, ఎమ్మార్పీఎస్ 

నాయకుడు ఎర్ర పహాడ్