నిబంధనలకు నీళ్లొదులుతూ..!
- నాసిరకంగా జరుగుతున్న ఎన్‌ఎస్‌పీ లైనింగ్ పనులు ?
- ప్రమాదం సంభవిస్తే భారీ నష్టం తప్పదంటున్న రైతులు
- కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు అంటూ ఆరోపణలు
- అధికారుల పర్యవేక్షణ కరువైందంటూ విమర్శలు
- నాణ్యతతో కూడిన పనులు చేయాలని రైతుల విన్నపాలు
వేములపల్లి, మే 21 : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మరమత్తుల పనులలో భాగంగా కాంట్రాక్టర్లు చేపట్టే లైనింగ్ పనులు నాసిరకంగా చేపడుతుండడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నాసిరకం పనుల వలన ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎడమ కాలువకు నిడమనూరు సమీపంలో గండిపడి కొన్ని వేల ఎకరాల పంట పొలాలు నష్టం వాటిల్లింది కానీ అక్కడ ఎలాంటి గ్రామం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక్కడ గండి పడితే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. ఈ కాలువ క్రింద తడకమల్ల, తక్కెళ్ళపాడు, కామపేల్లి గూడెం, ఉట్లపల్లి ముంపు గ్రామాలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఊర్లకు ఊర్లో కొట్టుకపోయే అవకాశం ఉందని ప్రజలు రైతులు చర్చించుకుంటున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకు 40 కోట్ల రూపాయల వ్యయంతో లైనింగ్ పనులు చేస్తున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు టెండర్ వేసిన పత్రాలలో ఎంత వ్యయంతో పనిచేయాలి ఎలాంటి నిబంధనలు పాటించాలని అనే సూచనలు సూచిస్థారు.
చేపట్టే పనులకు ఎంత మోతాదులో ఇసుక కలపాలి, ఎంత సిమెంటు కలపాలి అనే విషయాలు స్పష్టంగా తెలుపబడి ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్లు పనిచేయాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కుతూ పనులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా పనులు చేపడుతుండడంతో ప్రజా ప్రతినిధుల, అధికారుల అండదండలు మెండుగానే ఉన్నాయని రైతులు, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ప్రమాదం సంభవిస్తే భారీ నష్టం:
సాగర్ ఎడమ కాలువకు నాసిరకం పనులతో మరమ్మత్తులు కొనసాగిస్తున్నారు. ఈ పనుల వలన కాలువకు పెద్ద గండి పడి ఏదైనా ప్రమాదం జరిగితే తడకమళ్ళ, కామేపల్లిగూడెం ,ఉట్లపల్లి ,తక్కెళ్ళపాడు గ్రామాలను ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల్లోని ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఒకవేళ సంభవిస్తే పంట నష్టం, ప్రాణ నష్టం తో పాటు కొన్ని గ్రామాలు కొట్టుకోబోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
నిబంధనలకు నీళ్ళోదులుతూ పనులు!:
కాల్వలకు లైనింగ్ పనులు చేసేటప్పుడు ఎంత మోతాదులో సిమెంటుకు ఎంత ఇసుక కలపాలి. ఒకవేళ డస్ట్ కలిపే అవకాశం ఉంటే ఎంత కలపాలి అనేది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలి. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పనులు కొనసాగిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నాసిరకం మెటీరియల్ వాడుతూ కాల్వకు లైనింగ్ పనులు చేపడుతూ ఎలాంటి రోలింగ్ చేయడం లేదని విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
రైతులు, స్థానికులు పనులు ఇలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే మాకు మంత్రులు, ఎమ్మెల్యే, అధికారుల అండదండలు ఉన్నాయి మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదని కాంట్రాక్టర్లు అంటున్నట్టు వారు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. నాసిరకం పనులు చేయడం ఫలి తంగా పెను ప్రమాదం సంబంధించి అవకాశం ఉంటుందని కావున ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసు కోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
అధికారులు నిరంతర పర్యవేక్షణలు చేస్తూ నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా చూడాలి. పనులు నాసిరకంగా చేపడితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున పనులు సక్రమంగా జరిగేలా చూడాలి. అలాగే కట్ట పైన గుంటలు ఉండడం పలితంగా పలుమార్లు ధాన్యం లోడ్ లు కింద పడిపోయిన సందర్భాలున్నాయి. కావున కట్టపైన గుంతలు లేకుండా మట్టి పోసి ఇబ్బందులు లేకుండా చూడాలి.
- జగన్ రెడ్డి, శెట్టిపాలెం






