22 May, 2026 | 12:47 AM

అండర్ పాస్‌లపై నేతల వండర్ గేమ్!

22-05-2026 12:00 AM

ప్రజల ప్రాణాలతో రాజకీయ చెలగాటం

కాగితాలపైనే ఖతర్నాక్ ప్లాన్..

ప్రజల విన్నపాలు బుట్ట దాఖలు 

చేవెళ్ల, మే 21 (విజయక్రాంతి): అది గల్లీ నుంచి ఢిల్లీని అనుసంధానించే అత్యంత కీలకమైన హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి. కానీ, ఈ ప్రాంత నాయకుల స్వార్థం, నిర్లక్ష్యం వల్ల అది కాస్తా ’మృత్యు రహదారి’గా మారింది. ఏళ్లుగా సాగుతున్న భూసేకరణ ప్రహసనం, కోర్టు కేసులు, ఎన్జీటీ కొర్రీలు దాటుకుని ఇప్పుడిప్పుడే రోడ్డు పనులు ఊపందుకుంటుంటే... నియోజకవర్గ నేతలు సరికొత్త ‘రాజకీయ వింత నాటకానికి’ తెరలేపారు. ‘ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి‘ అన్న చందంగా మారిన చేవెళ్ల హైవే అభివృద్ధిపై ప్రత్యేక కథనం.

రూ. 928 కోట్ల భారీ బడ్జెట్..

రూ. 928 కోట్ల అంచనా వ్యయంతో 100 ఫీట్ల వెడల్పు, సెంట్రల్ డివైడర్, ఫోర్ లేన్ల (నాలుగు వరుసల) రహదారిగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రోడ్డు నిర్మాణం, కల్వర్టుల కోసమే రూ. 786 కోట్లు ఖర్చు చేస్తుండగా, మిగతా నిధులను భూసేకరణ కోసం కేటాయించారు. ప్లాన్ ప్రకారం... రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లు, 18 అండర్ పాస్లు, 30కి పైగా చిన్న బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.కానీ, కాగితాలపై ఉన్న ఈ అద్భుతమైన ప్లాన్ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎందుకు కుంటుపడింది? దానికి కారణం నాయకుల పట్టింపులేనితనమే. 2018 నుంచే రెండు మండలాల్లో దాదాపు 300 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినా, పనుల్లో మాత్రం వేగం శూన్యం.

మర్రిచెట్ల వివాదం.. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ...

పర్యావరణ పరిరక్షణ పేరిట చేవెళ్ల రోడ్డులోని చారిత్రాత్మక మర్రిచెట్లను రక్షించాలంటూ ‘సేవ్ బనియన్ ట్రీస్’ సంస్థ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)ని ఆశ్రయించడంతో ఈ ప్రాజెక్టుకు పెద్ద బ్రేక్ పడింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024 అక్టోబర్ 31న ఈ కేసు ఉపసంహరణ జరిగింది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ డీకొని ప్రయాణికులు మృత్యువాత పడటంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి పర్యావరణవేత్తలతో చర్చలు జరిపి పనులకు లైన్ క్లియర్ చేశారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. లోకల్ లీడర్ల ‘అండర్ పాస్’ రాజకీయం మళ్లీ కొత్త తలనొప్పులు తెస్తోంది.

ప్లాన్ రిలీజై ఏండ్లు గడుస్తున్నా..

2016లోనే కేంద్రం రూ. 880 కోట్లు మంజూరు చేసి, బైపాస్లు, అండర్ పాస్లతో కూడిన ‘రోడ్ మ్యాప్’ విడుదల చేసింది. ఒక సర్పం స్థాయి నుంచి ఎంపీ వరకు ఎవ్వరూ ఈ రోడ్ మ్యాప్ను ఇన్నాళ్లూ చూడలేదా?ఎక్కడెక్కడ అండర్ పాస్లు వస్తున్నాయి, ఎక్కడ కర్వులు ఉన్నాయి అనే విషయం అలపక్ష నాయకులకు తెలియదా?

ఇప్పుడు రోడ్డు పనులు దాదాపు చివరి దశకు వచ్చాక, ‘ఇక్కడ అండర్ పాస్ కావాలి.. అక్కడ సర్వీస్ రోడ్ కావాలి‘ అంటూ నిష్ఠ లేని వినతిపత్రాలు ఇస్తే రోడ్డు ప్లాన్ మారుతుందా?మల్కాపూర్, ఆలూరు గేట్ వద్ద అండర్ పాస్ ప్రతిపాదనలు ఉన్నచోటే రోడ్డు పనులు పూర్తి చేసేశారు. ఇక నక్ష రోడ్డు చేవెళ్ల - దామరగిద్ద, ఖానాపూర్ గేట్ల వద్ద మాత్రమే వర్క్ పెండింగ్లో ఉంది. ఇలాంటి టైంలో నాయకులు డ్రామాలు ఆడుతుండటంతో ప్రజలు అండర్ పాస్లపై ఆశలు వదిలేసుకుంటున్నారు.

విన్నపాలు వీధిపాలు.. ఢిల్లీకి వెళ్లే ‘ఘనుడు’ ఏడి?

ప్రజలు ఆర్డీవోకు, గ్రామ నేతలు కలెక్టర్కు, ఎమ్మెల్యే అసెంబ్లీలోనూ, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ కాగితాలు బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప కేంద్రానికి చేరడం లేదు.కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నేరుగా కలిసి, ఈ ప్రాంత ప్రజల కష్టాలను వివరించి, అవసరమైన చోట అండడ్ పాస్లు మంజూరు చేయించగల దమ్మున్న ‘ఘనుడు’ ఈ నియోజకవర్గంలో లేడా? గెలిచిన ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కేవలం ఫోటోల కోసం వినతిపత్రాలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రధనస్సులో మనకు కనిపించే రంగులు ఏడు.

కానీ ఈ చేవెళ్ల రాజకీయ నాయకులు చూపిస్తున్న ‘అండర్ పాస్ వినతిపత్రాల వండర్ గేమ్’ ఆ ఇంద్రధనస్సులో కూడా లేని ఎనిమిదో రంగు లాంటిదని చెప్పావచ్చు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నేతలు, నిత్యం ప్రమాదాలతో శవాల దిబ్బగా మారుతున్న చేవెళ్ల హైవే సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికైనా పొలిటికల్ గేమ్స్ పక్కనబెట్టి, కేంద్రంతో మాట్లాడి అండర్ పాస్ సమస్యను పరిష్కరించకపోతే.. ఈ ప్రాంత ప్రజల శాపం నేతలకు తగలడం ఖాయం అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.