వీధి కుక్కలు డంప్ యార్డుకు తరలింపు
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు(Stray Dogs) స్వైరవిహారం చేస్తుండటంతో వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గురువారం గ్రామ పంచాయతీ నడుం బిగించింది. కుక్కలను పట్టుకోవడంలో నైపుణ్యం కలిగిన నిపుణులను ఖమ్మం నుంచి రప్పించి, ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక బృందం ఆధునిక వలలు, పరికరాలను ఉపయోగించి సురక్షితంగా బంధిస్తున్నారు. గ్రామ వీధుల్లోని కుక్కలను చాకచక్యంగా వెంబడించి పట్టుకుంటున్నారు.
పట్టుకున్న కుక్కలను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. దమ్మపేట గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి అనంత్ కుమార్, పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు చిన్నపిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరుకు తరచూ గాయపరచడం, వాహనదారులను వెంబడించి ప్రమాదాలకు కారణం అవుతున్న వీధి కుక్కలను పట్టుకుని కోదాడ కుక్కల డంప్ యార్డులకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి కోతులను వదులుతున్నట్లు, కుక్కలను కూడా ఈ ప్రాంతాలలో వదులుతున్నారని వారి పట్ల నిఘా ఉంచినట్లు పంచాయితీ పాలకవర్గం తెలిపింది. అటువంటి వారు ప్రజలకు తారసపడితే వారిని అడ్డగించి పంచాయితీ అధికారికి, పాలక వర్గానికి సమాచారం అందించాలని కోరారు.




