5 March, 2026 | 3:15 PM

హైడ్రా అరాచకాలకు అంతే లేదు! ఇది బుల్డోజర్ రాజ్యం కాదా?

05-03-2026 01:49 PM
  1. మూసీ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు 
  2. ఖమ్మంలో  పేదల ఇండ్లు కూల్చేశారు
  3. రూ. 16 వేల కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన మూసీ డెవలప్‌మెంట్‌(Musi Development) ప్రాంతాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)  పరిశీలించారు. కాంగ్రెస్ బుల్డోజర్ సర్కార్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో మాట్లాడిన కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. నాగోల్ లో అభివృద్ధి చేసిన మూసీ ప్రాంతాలను, కేటీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి బృందం పరిశీలించింది. రూ. 16 వేల కోట్లతో అయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును, సీఎం రేవంత్ రెడ్డి 1.50 వేల కోట్ల రూపాయలకు పెంచారని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

హైడ్రా పేరుతో చేస్తున్న అరాచకాలపై హద్దులేదు, హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్గిలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) కట్టుకున్న ఇల్లు.. రెడ్డికుంటలో ఉందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు.. ఎఫ్ టీఎల్(FTL) ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది.. హామీల అమలు కోసమే అన్నారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. తమకు అప్పగిస్తే ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా రూ. 16 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. 

రెండున్నరేళ్ళు అయ్యింది కానీ ఇప్పటివరకు కనీసం డీపీఆర్ లేదన్న కేటీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు రెడ్ మార్క్ వేసి, నోటీసులు ఇవ్వకుండా అధికారులే వచ్చి అనధికారికంగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ వెనుక వేరే కారణం ఉందని తెలిపారు. యూపీలో బుల్‌డోజర్ రాజ్యమని రాహుల్ గాంధీ అంటారు.. తెలంగాణలో ఏ రాజ్యం నడుస్తోంది? రాహుల్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శత్రు దేశంపై యుద్దంలా ఖమ్మంలో ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. హైడ్రా పేరతో హైదరాబాద్ లో అరాచకాలు చేస్తున్నారు. రేవంత్ దగ్గర సమాధానం ఉంటే ప్రజలకు చెప్పాలని కోరారు. సందర్భం వస్తే ప్రజలే కుర్చీ మడత పెడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్న కేటీఆర్ మూసీ పేరుతో లూటీకి తాము వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు.