28 February, 2026 | 4:32 AM

ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి

28-02-2026 02:28 AM
  1. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు..

అవి రూ. 47,776 కోట్ల అక్రమ ప్రాజెక్టులు

రోజుకు 8 టీఎంసీల నీటి మళ్లింపునకు యత్నం

కేఆర్‌ఎంబీకి ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్‌బాబు లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : కృష్ణా నదీ జలాల వినియో గంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం మరోసారి ముదిరింది. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కొత్త ప్రాజెక్టు లు చేపడుతోందని ఆరోపిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)ని కోరింది.

ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్- ఇన్ -చీఫ్(ఈఎన్సీ) రమేష్ బాబు అధికారిక లేఖ రాశారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాన్ని మరోసారి రాజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి సుమారు రూ. 47,776.50 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందని తెలంగాణ ఆరోపించింది.

ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలికి భారీ స్థాయిలో మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. ప్రత్యేకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి మళ్లింపును భారీగా పెంచేందుకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. 

అదనంగా 114 టీఎంసీలు వినియోగించే కుట్ర..

ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రణాళిక ఉందని, ఇతర ప్రాజెక్టులతో కలిపి మొత్తం రోజుకు 8 టీఎంసీల వరకు నీటిని బేసిన్ బయటకు మళ్లించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ఆరోపించింది. దీని కోసం శ్రీశైలం రైట్ మెయిన్ కాలువ విస్తరణ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్య పెంపు, కాలువల వెడల్పు 78 మీటర్ల వరకు పెంపు వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

హంద్రీ-నీవా, గాలేరు- నగరి, తెలుగు గంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల పరిధిని పెంచి మొత్తం 114.75 టీఎంసీల అదనపు నీటిని వినియోగించాలనే ప్రణాళిక ఉందని తెలంగాణ వెల్లడించింది. అలాగే భవిష్యత్ ప్రాజె క్టుల పేరుతో మరో 176.457 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలికి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంది.

తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర ముప్పు..

తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు కొత్త వి కాదని, అవి ఇప్పటికే ఉన్న లేదా కొనసాగుతున్న ప్రాజెక్టులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ ముందు వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటికే సమర్పించామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ. నం.34 ద్వారా కొత్త స్టోరేజ్ అవకాశాలపై కేవలం డీపీఆర్ తయారీ కోసం మాత్ర మే అధ్యయనం ప్రారంభించిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ చర్యలు కొనసాగితే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా లపై ఆధారపడిన తెలంగాణ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రత్యేకంగా కృష్ణా బేసిన్‌లోని ఎండబారిన జిల్లాల్లో సాగునీటి పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కేఆర్‌ఎంబీ లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోగా తెలంగాణ ప్రాజెక్టులపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం అన్యాయమని పేర్కొంది.

వెంటనే జోక్యం చేసుకోండి..

కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా దోచుకోవడంపై కేఆర్‌ఎంబీ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తుం ది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఆయా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. దీంతో పాటు కృష్ణా జలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ పాల్పడుతున్న ఉల్లం ఘనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది.

కృష్ణా జలాల తుది పంప కాలపై ట్రైబ్యునల్ విచారణ కొనసాగుతున్న సమయంలో తెలంగాణ తాజా లేఖ అత్యం త కీలకంగా మారింది. ఈ పరిణామం రెం డు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెం చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణా జలాలపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.