ఎస్‌టీఓ సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్
ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు
ఆయన నివాసం, మోత్కూర్ కార్యాలయంలో తనిఖీలు
సూర్యాపేట/గుండాల, మార్చి 12 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఎండీ ఖదీర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గురువారం మోత్కూర్‌లోని ఎస్‌టీఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అంతకుముందు భువనగిరిలో డీటీఓ కార్యాలయంలో ఖదీర్‌ని అరెస్టు చేసి నేరుగా మోత్కూర్‌లోని ఎస్‌టీఓ కార్యాలయానికితీసుకొచ్చి విచారణ చేసి, పలు రకాల రికార్డులను పరిశీలించారు.
నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎండీ ఖదీర్ అవినీతిపై ఈ నెల 4న కార్యాలయంలో మోత్కూర్ ఎంపీఓ పైళ్ల జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. గుండాల ఎంపీఓగా పని చేసి మోత్కూర్‌కి బదిలీపై వచ్చిన జనార్దన్ రెడ్డి తన 38 రోజుల పెండింగ్ శాలరీ కోసం సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ రూ.ఐదువేలు లంచం డిమాండ్ చేశాడు.
అదే కార్యాలయంలో పనిచేస్తున్న నిరంజన్ కి ఫోన్ పే చేయమని చెప్పగా జనార్దన్ రెడ్డి ఫోన్ పే చేశాడు. అలాగే ఫిబ్రవరి వేతనం కూడా వచ్చేలా చూడాలని జనార్దన్ రెడ్డి ఖదీర్‌ని కోరగా ఐటీ సమస్య ఉందని బెదిరించడంతో మరో రూ.ఐదువేలు నేరుగా ఖదీర్ కి ఫిబ్రవరి 27న ఫోన్ పే చేసినట్లు తెలిపారు.రూ.10 వేలు లంచం ఇచ్చినప్పటికీ బిల్లు ఆలస్యం కావడంతో సదరు ఎంపీఓ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ డీటీఓను విచారణ అధికారిగా నియమించి మోత్కూర్ ఎస్‌టీఓ కార్యాలయంలో విచారణ చేసినట్లు తెలిపారు.
గుండాల ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో ఉద్యోగి సైతం ఫిబ్రవరి శాలరీ కోసం రూ.5వేలు ఖదీర్ డిమాండ్ మేరకు ఫోన్ పే చేశారని వివరించారు.సీనియర్ అకౌంటెంట్ నిరంజన్ తనకు ఫోన్ పే చేసిన అమౌంట్ రూ.5 వేలు తిరిగి ఎంపీఓకి వాపస్ చేసినట్లు తెలిపారు. వీరిద్దరు అధికారులు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఎండీ ఖదీర్ పై కేసు నమోదు చేసి, భువనగిరి లో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.




