9 July, 2026 | 1:23 AM

10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్

09-07-2026 12:27 AM

ఆర్‌ఎస్యూ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ సతీష్ కుమార్

మేడ్చల్, జూలై 8 (విజయ క్రాంతి):  రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించి, విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని ఆర్‌ఎస్యూ (రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా ప్రెస్క్లబ్లో బుధవారం ఆర్‌ఎస్యూ జిల్లా అధ్యక్షుడు గరుగుల రాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నాగేష్ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, లెక్చరర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని, ఇంటర్ కళాశాలలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్‌ఎస్యూ జిల్లా కార్యదర్శి నరేష్, సోషల్ మీడియా ఇన్చార్జి చాకలి రాజు, టిపివైఎఫ్ రాష్ట్ర నాయకుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.