9 July, 2026 | 2:16 AM

చినుకు జాడేది.. సాగుకు దారేది..

09-07-2026 01:22 AM

కరీంనగర్/మనకొండూర్, జులై 8 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 9 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లో కూడా సాగు కాలేదు. సాగుకోసం సిద్ధం చేసిన వరినార్లు ఎండిపోతున్నాయి.

ప్రధాన ప్రాజెక్టులైన శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దిగువ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) లలో నీటి మట్టాలు పడిపోవడంతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచిస్తోంది. గోదావరి, మానేరు నదులు ఎండిపోవడంతోపాటు మిడ్ మానేరు, ఎల్‌ఎండీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.

ఎల్నినో ప్రభావం: వాతావరణంలో అనిశ్చితి, వర్షాల తీవ్రత తగ్గడం వలన అన్నదాతలు వరి సాగు చేయడానికి మీమాంసకు గురవుతున్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా.. తక్కువ నీటితో పండే మొక్కజన్న, కందులు, పెసలు, టమాటా వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే వారి నారు సిద్ధం చేసుకున్న రైతన్న అరుతడికి సిద్ధం కాలేకపోతున్నారు. 

నాలుగెకరాలలో మాత్రమే  వరి సాగు చేశాను

గతంలో ఆరు ఎకరాలు ఏ ఆటంకం లేకుండా నీటి కొరత ఎదురు కాకుండా సాగు చేసే పరిస్థితులు ఉండేవి. వ్యవసాయ బావులు సైతం ఎండిపోయి ప్రస్తుతం రెండు ఎకరాల సాగు నిలిచిపోయింది

బోయిని వెంకటేశం,రైతు, దేవంపల్లి మండలం

నాకు ఒక ఎకరం భూమి ఉంది

ప్రస్తుతం వరి సాగు చేద్దామంటే చెరువు ఎండిపోయింది. దాంతో నీటి కొరత వల్ల ఉన్న ఎకరం సాగు చేసే పరిస్థితి లేదు. వర్షాలు కురిస్తేనే సాగుకు అవకాశం ఉంటుంది.

శాతరాజు యాదగిరిరైతుగ్రామం, కొండపల్కల మండలం,

గతంలో 12 ఎకరాలు సాగు చేసేవాడిని

నాలుగు ఎకరాలలో బావి నీటి పారకంతో ఇటీవల నాటు వేశాను. నీతి వసతి లేక ఎనిమిది ఎకరాల లో సాగుకు ఇబ్బంది అవుతుంది. వర్షాలు లేక బావిలో నీరు సరిపోవడం లేదు. వర్షాలు కురిస్తేనే మిగతా 8 ఎకరాల సాగుకు అవకాశం ఉంటుంది.

మరి కొండయ్య, రైతు లలిత పూర్‌మానకొండూరు మండలం