రాష్ట్రస్థాయి ఉత్తమ గైనకాలజిస్ట్ డాక్టర్ అన్నపూర్ణకు పురస్కారం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా
అవార్డు ప్రదానం
గజ్వేల్, ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అందజేసే రాష్ట్రస్థాయి పురస్కారాలలో భాగంగా, గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డాక్టర్ అన్నపూర్ణ గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా సేవలు అందిస్తూ, రికార్డు స్థాయిలో అత్యధిక సంఖ్యలో ప్రసవాలు (డెలివరీసు) నిర్వహించినందుకు గాను ఉత్తమ గైనకాలజిస్ట్ గా ఎంపికయ్యారు. అలాగే సిద్దిపేట జిల్లాలో డి.సి.హెచ్.ఎస్ మెడికల్ సూపరింటెండెంట్గా ఆమె అందించిన అత్యుత్తమ సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ పురస్కారం కేవలం నా ఒక్కరి కృషి వల్ల సాధ్యం కాలేదని, ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు, సమిష్టి కృషి వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తున్నామన్నారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేస్తానని, సిద్దిపేట జిల్లాను వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు.




