8 April, 2026 | 1:59 AM

బీజేపీలో ఎంపీ ఈటల రాజేందర్‌కు ఉక్కపోత

08-04-2026 12:00 AM
  1. మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం 
  2. సొంత పార్టీ నేతల పనేనని భావిస్తున్న ఈటల గతంలో ఘాటు జవాబు 
  3. సొంత నియోజక వర్గం హుజురాబాద్ వెళ్ళవద్దని ఆంక్షలు 
  4. పదవులు రాకుండా అడ్డుకుంటున్నది వారేనని నారాజ్ 
  5. అప్పుడప్పుడు ఆక్రోశము వెళ్లగక్కుతున్న ఎంపీ 

మేడ్చల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉక్కపోతకు గురవుతున్నారా? పార్టీ మారుతానని సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని, వివిధ రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన భావిస్తున్నారా? అంటే తాజాగా చేసిన వ్యాఖ్యలు అవుననే అంటున్నాయి. దుష్ప్రచారంపై సొంత పార్టీ నాయకులపై పరోక్షంగా అప్పుడప్పుడు ఆక్రోషం సైతం వెళ్లగకుతున్నారు.

ఈటెల రాజేందర్ మళ్లీ బి ఆర్ ఎస్ లో చేరుతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరగడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా  రాజేందర్ ఖండించారు. తాజాగా మళ్లీ ఆదివారం పూడూరు శివారులో ని నివాసంలో దుష్ప్రచారాన్ని ఖండించారు. కెసిఆర్ తనను భర్తరఫ్ చేశారని, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారని, అప్పటి ఇబ్బందులు తలుచుకుంటేనే బాధ అనిపిస్తుందని, ఎన్నో సమస్యలు ఎదుర్కొని మళ్లీ బి ఆర్ ఎస్ లో ఎలా చేరుతానని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఈ ప్రచారం వెనుక సొంత పార్టీ నాయకుల హస్తముందని ఆయన భావిస్తున్నారు. గతంలో ప్రచారం జరిగినప్పుడు కూడా సొంత పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. జూలై 19న హుజురాబాద్ నుంచి పార్టీ కార్యకర్తలు పూడూరులోని ఆయన ఇంటికి వచ్చిన సమయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.’ ఒక సైకో, శాడిస్టు, వాడు మనిషా, ఏ పార్టీలో ఉన్నాడు, కొడుకా బి కేర్ఫుల్’అని మండిపడ్డారు. ఎవరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. 

ఎన్నికల సమయంలో హుజురాబాద్ వెళ్ళవద్దని ఆంక్షలు 

మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గంలో హుజురాబాద్ వెళ్ళవద్దని బిజెపి నాయకులు ఆంక్షలు విధించారు. 20 ఏళ్లు ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచర గణం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ అక్కడే పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో ప్రభావితం చేయగల నాయకుడు. అయినప్పటికీ హుజురాబాద్ వెళ్ళవద్దని పార్టీ పెద్దలు సూచించడం విస్మయానికి గురిచేస్తుంది.

ఎన్నికల సమయంలో నాయకులందరినీ ప్రచారానికి పిలిచి పార్టీ  అ భ్యర్థుల విజయానికి చర్యలు తీసుకుంటారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు. కానీ ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ రావద్దు అని చెప్పడం అంతర్గత పోరుకు అద్దం పడుతోంది.  అంతర్గత వర్గ పోరులో బీజేపీ అభ్యర్థులు బలయ్యారు. 

ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు 

ఈటల రాజేందర్ కు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రులను, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ లను కలుస్తుంటారు. కానీ రాష్ట్ర నాయకులతో విభేదాలు ఉన్నాయి. పదవులు రాకుండా రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారని రాజేందర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సొంత పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి లోను తన ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈటెల రాజేందర్ అనుమానిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇతర నాయకులు వేలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించి గెలిచేవారికి టికెట్లు అని ప్రకటించారు. అంతేగాక ఈ నియోజకవర్గంలో తనకున్నంత అవగాహన ఇంకొకరికి ఉండదని స్పష్టం చేశారు.