8 April, 2026 | 3:48 AM

సంగారెడ్డిలో 5కే రన్ విజయవంతం

08-04-2026 12:03 AM

పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 7(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5కే రన్  కార్యక్రమం మెడికల్ కాలేజీ నుండి ఐబి వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ  ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా మాత్రమే వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సాధారణంగా 40-50 ఏళ్ల తర్వాతే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, కానీ ప్రస్తుత యువత ముందుగానే ఆరోగ్యంపై దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం వైద్యులు సరైన జీవనశైలిపై మార్గదర్శకాలు అందించాలని సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా, సమతుల్య ఆహారం,  వ్యాయామం, పరిశుభ్రత, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి ప్రధాన  అంశాలు.  యువత ఈ అంశాలను పాటించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని  తెలిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో జీవించాలని, జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. శాస్త్రసమ్మత జీవనశైలిని అనుసరించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, డీఎస్పీ సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మెడికల్ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.