ఉత్సాహంగా విద్యార్థి సంఘ ఎన్నికలు
‘సర్వజ్ఞ’ పాఠశాలలో నిర్వహణ
ఖమ్మం, జూలై 11(విజయక్రాంతి): పట్టణంలోని వీడీఓఎస్ కాలనీ సర్వజ్ఞ పాఠశాల విద్యార్థి సంఘం ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన పాఠశాల విద్యార్థి సంఘం ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్, డైరెక్టర్ నీలిమ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం ఎంతో అవసరమని, ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడానికే ఈ ఎన్నికలు నిర్వహించామన్నారు. గెలిచిన ప్రతి లీడర్ పాఠశాల క్రమశిక్షణకు, తోటి విద్యార్థుల ప్రగతికి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల డైరెక్టర్ నీలిమ నూతనంగా ఎన్నికైన లీడర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ పదవులు అనేవి కేవలం హోదా కోసం కాదని, బాధ్యతతో కూడుకున్నవని గుర్తుచేశారు. పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ నూతన క్యాబినెట్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






