3 September, 2026 | 1:06 AM

ఘనంగా ఎస్సార్పీ వన్ స్వర్ణోత్సవాలు

03-09-2026 | 12:05am

మంచిర్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని సింగరేణి(Singareni) శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఎస్ ఆర్ పీ 1 ఇంక్లైన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గని ఆవరణలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డైరెక్టర్ (పీపీ) కే వెంకటేశ్వర్లు(Venkateswarlu) ముఖ్య అతిథిగా హాజరై గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ పైలాన్ ను గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక భూగ ర్భ గని 50 ఏళ్లు పూర్తిచేసుకొని అందరి మధ్య స్వర్ణోత్సవ వేడుక జరుపుకోవటం హర్షణీయమన్నారు.

సింగరేణిలో పరిస్థితులు మారాయని, పోటీ పెరిగిందని, నల్లనిదంతా బొగ్గు అని చెప్పి అమ్మే రోజులు పోయాయని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన బొగ్గును అందిస్తేనే సంస్థ మనుగడ సాధ్యమన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకొని, నాణ్యమైన బొగ్గు అందిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలలో రాణిస్తేనే సంస్థ మనుగడ సాధ్యం అని అన్నారు. ఉత్పత్తి, రక్షణలో చాలా మంచి ట్రాక్ రికార్డు కలిగిన మైన్ ఎస్సార్పీ 1 గని అని కొనియాడారు. 2018 లోనే ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిందన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఆర్పీ 1 గని, శ్రీరాంపూర్ ఏరియా, సింగరేణిపై రూపొందించిన డాక్యుమెంటరీ అందరినీ ఆకట్టుకుంది. గని ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఏజెంట్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ క్వాలిజీ జీఎం వీరభద్ర రావు, జీఎం క్వాలిటీ ఆర్జీ రీజియన్ వెంకట్ రమణ, విశ్రాంత సీజీఎం సుగుణాకర్ రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు, సీఎంఓఏఐ అపెక్స్ కౌన్సిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, మేనేజర్ ఆత్మారాం సహానీ, ఉద్యోగులు, పెద్ద సంఖ్య లో విశ్రాంత ఉద్యోగులు, అధికారులు, యూనియన్ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.