3 September, 2026 | 2:06 AM

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-09-2026 | 01:02am

ఎస్పీ రోహిత్ రాజు 

సుజాతనగర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సైబర్ మోసాల పట్ల విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raju) సూచించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఆన్లైన్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం, నకిలీ పోలీస్ లేదా ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకోవడం, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేయడం, నకిలీ యాప్లు, లింకుల ద్వారా డబ్బులు కాజేయడం వంటి మోసాలకు సైబర్ నెరగాళ్లు పాల్పడుతున్నారని వివరించారు.

సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఫొటో మార్ఫింగ్, ఆన్లైన్ వేధింపులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి, వారి ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్త్స్రలు రమణారెడ్డి, జుబేదాబేగం, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు  పాల్గొన్నారు.